నాపై అనుమానం ఉంటే నేరుగా చెప్పేయి
ప్రతిచర్యలో ఇలా విసుగెందుకు చూపిస్తావు ?
ఇంట్లో అడుగుపెట్టగానే సమయాన్ని చూస్తావు
అడగక పోయినా నీ చూపులను అర్థం చేసుకోలేనా .... !?
ఉన్నత చదువుంది ఉద్యోగం చేయమని
ప్రోత్సహించింది నువ్వే .. కాదన్న ఒప్పించింది నువ్వే ..
నేను కాలక్షేపానికి పోతేకదా
నువ్వనుమానించాలి .... !?
నా ఉన్నత చదువుకు
పట్టా చూపించగలిగాను కానీ ,
ఉన్నత వ్యక్తిత్వానికి
ఆధారం ఎలా చూపించను.... ! ?
తాళి కట్టావు నా భారం మోస్తావని
ఇప్పుడు బరువయ్యానా .. బయిటికి పంపిస్తున్నావు ?
నా భారాన్ని తగ్గిస్తున్నానో .. నీ అనుమాన భారాన్ని
మోస్తున్నానో అర్థమే కావడం లేదు .... !!
ప్రతి మాటలో ద్వందర్థాలు , ప్రతిచర్యలో హృదయానికి గాయాలు ...
నువ్ చూసిన వాళ్ళలో ఎవరు
నీకు చనువిచ్చారో తెలియదు గాని
ఉద్యోగం చేసే అందరూ స్త్రీలు అలా ఉంటారనుకుంటే ఎలా ?
వీధిలో తల వంచుకొని
వెళ్ళక పోయినా
మనసుపై మాలిన్యం అంటకుండా
నడుచుకొనే ఎంతమంది లేరు ? ...
ఎంత నర్మగర్భంగా అంటావు
పరపురుషుడితో ఏది మాట్లాడినా
ఆకర్షణ , చనువు పెరిగి ,
ఏదో రోజు అనర్థాలకు దారితీస్తుందా ….. ! ?
నీకు తెలియదేమో స్వాభిమానం ఉన్న స్త్రీ
ఏ పరపురుషుడితో మాట్లాడిన
వేళ్ళతో కాదు చూపులతో సరిహద్దు గీస్తుంది
మనసుతో కాదు నాలుకతో మాట్లాడి
ఎదుటివాడి మనసులో రాబోయే వికృత భావాన్ని చంపేస్తుంది .... !!
మనస్బంధనం పవిత్రతను నువ్వు ఎలాగో విశ్వసించడం లేదు
నా పదవి విరమణ దాకా నీ అనుమానం ఎలాగో వీడదు ..
పోనీ ఒక పని చేస్తావా నీ అనుమాన నివృత్తి కోసం ....
ఏదైనా ఒక శారీరక బంధనం రూపొందించు నువ్వు మాత్రమే విప్పగలిగే .... .... !!