Followers

Monday, March 23, 2015

thumbnail

** నీ కోసం ..... **




రెండు విషయాలు తరుచుగా జ్ఞాపకం వస్తాయి 
నీ అందెల సవ్వడి .. నీ మాటల ఒరవడి 

రెండు విషయాలతో ఎప్పుడూ భయపడ్తాను 
నీ వేదనతో .. నీ నిష్క్రమణతో 

రెండు విషయాల కోసం ఎప్పుడూ సమయాన్ని వెచ్చిస్తాను 
నీ నిరీక్షణలో .. నీకోసం చేసే ప్రార్థనలో 

రెండు విషయాలపై నాకు హక్కు ఉందనుకుంటాను 
తనివితీరా చూసే నీ వదనంలో .. నీ కోసం చూసే స్వప్నంలో 

రెండు సందర్భాల్లో శ్వాస ఆగినట్టవుతుంది 
నా చెంతకు వస్తున్నప్పుడు .. నన్ను వీడిపోతున్నప్పుడు 

రెండు విషయాలు లేకుండా నేను ఉండలేను 
నాపై నువ్వు చూపే అభిమానం .. నాపై ఉంచే నమ్మకం 

రెండు విషయాల కోసం ఏదైనా చేయగలను 
నీ చిరునవ్వు కోసం ...అది చూసి వచ్చే నా చిరునవ్వు కోసం ..



Saturday, March 21, 2015

thumbnail

భాష్పాలు ....


విఫల ప్రేమలో కన్నీళ్లు వస్తాయి నిజమే .... 
ఒంటరితనం బాధించి కాదు 
ఒకరిపై పెంచుకున్న నమ్మకం పరిహసిస్తుంటే 
దాన్నిజీర్ణించుకోలేక 
అనునయించుకోలేక
ప్రయత్నించి ... మర్చిపోలేక 
మనసును తేలికపర్చుకోలేక 
ఆత్మవంచన చేసుకోలేక .... 
కలిగే మానసిక చర్యకు 
బాహ్యపు తార్కణమది .....



Friday, March 20, 2015

thumbnail

** కూతురు ..**




నువ్వొక్కదానివి ఎన్ని అద్భుతాలు చేసి 
ఎంతగా నా జీవనసరళిని మార్చేసావురా
నువ్వచ్చాకా నా జీవితంలోకి 
నేను నాన్నను కాదు .. బుద్ధిమంతున్నైయ్యాను

నీ చిరునవ్వులను చూసి
నా అలుపును మరవాలని 
ఎక్కడో వృధాగా గడిపే సమయం 
నీకోసమే మూట కట్టుకొని ఇంటికొచ్చేస్తాను  

నీ ఆనందమే నా జీవితం కావాలని 
మీ అమ్మపై ఉండే ప్రేమ కూడా 
పూర్తిగా నీ భాగంలోనే కలిపేసాను 

నిన్ను హృదయానికి హత్తుకున్నప్పుడు 
ఆ అనుభూతి ఈ భావన ఇస్తుంది 
జీవంతో ఉండి స్వర్గానికి వచ్చాఎలాని 

నీ శ్రేయస్సుకు తపిస్తున్నప్పుడు 
మా అమ్మానాన్నల పై అనురాగం ఉప్పొంగుతుంది 
వాళ్ళు నాకోసమే ఇలాగే తపించారు కదాని...

అందుకే తల్లి చెప్పేది 
నువ్వు నన్ను నాన్నను కాదు 
నిజానికి ఒక మనిషిగా చేసావు 


Wednesday, March 18, 2015

thumbnail

నువ్వే అవుతావు...



అకారణంగా మందహాసం వచ్చిన 
నలుగురిలో ఉండి ఒంటరితనం అనిపించిన 
సర్వం ఉండి ఇంకేదో వెలితి కనిపించిన 
మనసు ఎప్పుడైన ఉదాసీనంగా మారినా ..
చెప్పుకోవడానికి ఏదో నెపం ఉన్నా 
నిజానికి అసలు కారణం మాత్రం 
నువ్వే అవుతావు....



thumbnail

** తేడా .... నీకు నాకు ఇంతే .... **


నువ్వు అక్షరాలను శరాలుగా సంధించి 
ఆహాన్ని చల్లార్చుకుంటావు 
నేను అక్షరాలను భావాలుగా కుదించి 
ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించుకుంటాను

నువ్వు అక్షరాలను సమిధులుగా చేసి 
అనుబంధాలను ఆహుతి చేస్తావు 
నేను అక్షరాలను వారధులుగా చేసి 
ఆప్తుల పరిధికి చేరాలని చూస్తాను 

నువ్వు అక్షరాలను అలంకరించి 
అందరి దృష్టికి కేంద్రానివవుతావు 
నేను అక్షరాల సహజత్వాన్ని అలాగే ఉంచి 
కొన్ని హృదయాలకైనా స్పందనవుతాను 


నువ్వు అక్షరాలను 
ఆజ్ఞాపించి నాట్యమాడిస్తావు 
నేను అక్షరాలను 
అభ్యర్తించి ఆహ్లాదాన్ని రప్పిస్తాను
తేడా .... నీకు నాకు ఇంతే .... 







Tuesday, March 17, 2015

thumbnail

** ఒయాసిస్ **

ఎంత ఎదిగిపోయావే ..!? 
నువ్వా మాట అన్నప్పుడు 
వ్యంగ్యంగా భావించానే కానీ 
అమ్మా... నీ ఆక్రోశాన్ని , ఆవేదనను 
అర్థం చేసుకోలేకపోయానే ....

ఆ సమయం 
ఎంత సునాయాసంగా చెప్పాను 
ప్రేమించాను ఇతను లేకుండా ఉండలేనని ...

నిజానికి అందులో అంతర్లీనంగా ఉండే మరో అర్థం 
కనిపెంచిన మీప్రేమ ఇప్పుడు అవసరం లేదు 
ఇతని ప్రేమ మీకంటే గొప్పదని .....కానీ 
అప్పుడు నాకు అర్థం కాలేదు

నా కళ్లపై ఆకర్షణ పొర ఉండి 
మీ ప్రేమ కనిపించలేదేమో 
అప్పుడు మీప్రేమకేమైంది ? 
నన్ను ఆపుకోకుండా వదిలేసారే ...

మీరు వదిలారో లేదో తెలియదు గాని 
ఆ ఇంటికి వెళ్లడానికి మాత్రం 
నేనెన్నో వదులుకున్నాను

ఆలవాట్లు ,అభిరుచులు , 
సంప్రదాయాలు ,కట్టుబాట్లు 
స్నేహాలు , బంధుత్వాలు 
మీ అందరు నిష్కల్మషంగా చూపించే ప్రేమలు ....

ఇలా అన్నీ వదులుకున్నాకా 
తిరిగి ఎన్ని పొందాననుకున్నారు 
కట్నం లేకుండా మొగుణ్ణి పొందానన్న 
అత్తగారి వ్యంగ్యాభినందన ..

లేచిపోయివచ్చినందుకు 
చూపులతోనే సరిహద్దు చూపే 
ఆడపడుచు అభిశంసన ...

కట్టుకున్నవాడి కోసం 
అహం వద్దు ఆత్మాభిమానం వద్దని
చిరునవ్వుని అరువుగా తెచ్చుకొని 
నలుగురిలో కలుద్దామనుకుంటే ...
రోజూ ఇవన్నీ పొందుతున్న 
నాకెన్ని ఆనందభాష్పాలు 
వస్తాయో కదమ్మా ...

ఆ భాష్పాలు తుడిచే నాథుడు
రాత్రి అనునయించే మాటలు 
అప్పటి వరకే .. మరి బెట్టు చేస్తే 
వాళ్ళతో కాదు నాతో సంసారం 
నేనున్నాను కదాని ...

అతనికెలా చెప్పాలి 
భర్త ఒక్కడే కుటుంభం కాదని 
అయిన కుటుంభమనే పదం 
వాడగలిగే అర్హత నాకుందా ..?

ఒక తప్పటడుగు జీవితాన్నింతగా 
ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకొని ఉంటే 
కన్నవాళ్ల కంటే మరెవ్వరూ 
సంతానం శ్రేయస్సు ఆలోచించరనే 
విషయం కూడా ఎప్పుడో అర్థమై ఉండేది ...

అయినా ఇప్పుడేం ఆలోచించిన
ఏముంది ప్రయోజనం 
నేను అనుభవిస్తున క్షోభ సబబే కదా .... 
నా స్వార్థం గురించి ఎన్ని హృదయాలకు 
నేనిలాంటి బాధ ఇవ్వలేదూ ...!? .....

thumbnail

** మస్త్ యాద్ కొస్తావే ... **



ఒక్కసారి రారాదే 
రెండు ముచ్చట్లు మాట్లాడుకుందాం
నా మాట జర వినవే .. 
మస్త్ యాద్ కొస్తున్నవ్

చేనుకాడికెళ్లినపుడు
గాలికి తలూపే
పచ్చని పైరును జూస్తే 
నువ్వే యాద్కొస్తవ్

మంచె పైకెక్కి 
కునుకు తీద్దామనుకుంటే 
పిట్టల సప్పుడుకు 
నువ్వే యాద్కొస్తవ్

ఇగ నిద్దుర పోక నీ గుడిసె దిక్కు 
పిచ్చోనీలా జూస్తూ ఉంటా 
నువ్వేమో బీడీలు జేస్కుంటు 
పాటలు ఇంటూ ఉంటావ్

ఇగ నా ఫికరేం జేస్తవ్ 
నాకేం యాద్ జేస్తవ్
గా పాటలు ఇనన్న 
నన్ను జర యాద్జేస్కోవే

చేనుకాడ మీ నాయనకు సద్ది దెచ్చినపుడు 
నాకేసి సుత్తవూ సూడు.. 
గా సూపుకు 
నా కాళ్లుజేతులు ఏం పంజేయవ్

నేనట్టా సూత్తనే ఉంటా 
నువ్వు సిన్నగా నవ్వి ఎల్లిపోతావ్ 
ఇగ పనిచేద్దామంటే 
గింతకూడ బుద్ది పుట్టదాయే ..

నీ గుడిసె దిక్కు జూస్తే
మీ నాయనకు కోపం 
దుబాయిలో ఉన్నోనికే నా పోరినిస్తాను 
నా సూపులు సదివినట్లు జెప్పేస్తాడు

నువ్వే సెప్పు ముసలిదాన్ని ఇడిచి 
గాడికి నేను పోలేను . 
గాడికి నేఁ పోందే నా కాడికి నువ్ రాలేవు 
ఏం జేయాల్నే నాకు సమఝ్ అయ్తా లేదు

నువ్వు మీ నాయనతో 
జర మాట్లాడారాదే ... 
చేను రాసిస్తా .. పాక రాసిస్తా 
గవే కాదే నా పానం రాసిస్తా ...


thumbnail

** నీకెందుకులే ... !! **


ఎంత అమాయకంగా 
చెప్పి వెళ్లిపోయావు 
పరుషంగా మాట్లాడానే తప్పా 
నీ ప్రాణమేమి తీయలేదుగా అని ..

ప్రాణాలు పోయి ఉంటే 
ఆ బాధ అనిపించేది కొన్ని క్షణాలే ... 
ఇప్పుడు క్షణక్షణం పడ్తున్న బాధ 
నీకెలా చెప్పనూ ..

ఇప్పటికీ నా అలవాట్లలో 
మార్పెందుకు రాదో అర్థమే కాదు
రావని తెలిసి కూడా 
నిరీక్షిస్తూనే ఉంటాను

నువ్వు రావద్దనే కోరిక కూడా ..దేనికంటే 
సానుభూతితో నువ్వు 
చూపించే నీడకన్నా 
ఇప్పుడున్న ఎండే 
ఎక్కువ సౌఖ్యాన్ని ఇస్తుంది

విలువలేని చోట విడిదెందుకనీ 
అనుకోను ఇష్టపడేవారిని కాదు 
ద్వేషించే వారిని ఇష్టపడటమే 
నా ఇష్టానికి నేను ఇచ్చే విలువ ..

ఒక నిర్జీవమైన భావానికే 
ఇంత విలువ ఇచ్చే నేను 
నన్నింకా సజీవంగా ఉంచే 
నీకెంత విలువ ఇస్తానో ...తెలుసా

ఇవన్ని నీకు విసుగునిస్తాయేమో 
నీకే ఏమిటి నా హృదయం కూడా 
విసుగ్గా ప్రశ్నిస్తుంది .. ఎందుకీ ఉదాసీనత ?
ఎలా చెప్పనూ ....మీకు 
మందహసించడానికి ఏ ఒక్క కారణం మిగలలేదని ....

Sunday, March 15, 2015

thumbnail

** నా హృదయాన్ని స్పృశించవూ .... ***




నా హృదయంలో ఎప్పుడైనా 
తొంగి చూసావా ... చూడవు .. 
చూడాలని కూడా అనుకోవు 

నిజానికి నీ తప్పు కూడా కాదులే ... 
నా అధరాలపై సదా లాస్యం చేసే 
మందహాసాన్ని చూస్తే 
నీకా ఆలోచన ఎలా వస్తుందిలే 

నీ కోసం వేకువనై .. 
నీకంటే ముందే ఉదయిస్తాను 
నీ కోసం శయనాన్నై . 
నాకంటే ముందే నిద్రపుచ్చుతాను

నువ్వింకా మనసులో అనుకుంటూనే ఉంటావు 
నీక్కావలసింది ప్రత్యక్షం చేయిస్తాను
నీ అడుగులు పడకముందే 
ఆ దారిలో తివాచినై సిద్ధంగా ఉంటాను 

నాదెంత చిరు ఆశ 
నీ కళ్ళలో ఏదో చూడాలని 
నా బాధ్యత అనుకుంటావే తప్పా 
మరో భావన నీ కళ్ళలో చూపించవు

సర్వ సౌఖ్యాలు ఇస్తున్నాననే దర్పం నీది 
మానసిక సౌఖ్యం కోసం తపించే అంతరంగం నాది
నువ్వు నిస్సంకోచంగా చెప్పగలిగినా 
నేను పరోక్షంగా కూడా చెప్పలేకపోతాను 

సాయింత్రాలు నువ్వచ్చేటప్పటికి 
నా మందహాసాన్ని తోరణంగా కడుతాను 
రాత్రుళ్లు వెన్నెల్ని మల్లెల్ని కలిపి 
నీకోసం పచ్చికలా పరుస్తాను

నువ్వేమో యవ్వనాన్ని 
మధువులో కలుపుకుంటూ ఉంటావు
భారమైన మనసుతో నేనేమో 
రాలిపోయే నక్షత్రాలను చూస్తూ ఉంటాను 

దేదీప్యమైన వెలుతురులోనే 
నా భావాలను చదువలేవు 
ఇక మసక వెన్నెల్లో 
నా కళ్లలోని తడి నువ్వెలా చూడగలవు లే .......


Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.