Followers

Tuesday, March 17, 2015

thumbnail

** ఒయాసిస్ **

ఎంత ఎదిగిపోయావే ..!? 
నువ్వా మాట అన్నప్పుడు 
వ్యంగ్యంగా భావించానే కానీ 
అమ్మా... నీ ఆక్రోశాన్ని , ఆవేదనను 
అర్థం చేసుకోలేకపోయానే ....

ఆ సమయం 
ఎంత సునాయాసంగా చెప్పాను 
ప్రేమించాను ఇతను లేకుండా ఉండలేనని ...

నిజానికి అందులో అంతర్లీనంగా ఉండే మరో అర్థం 
కనిపెంచిన మీప్రేమ ఇప్పుడు అవసరం లేదు 
ఇతని ప్రేమ మీకంటే గొప్పదని .....కానీ 
అప్పుడు నాకు అర్థం కాలేదు

నా కళ్లపై ఆకర్షణ పొర ఉండి 
మీ ప్రేమ కనిపించలేదేమో 
అప్పుడు మీప్రేమకేమైంది ? 
నన్ను ఆపుకోకుండా వదిలేసారే ...

మీరు వదిలారో లేదో తెలియదు గాని 
ఆ ఇంటికి వెళ్లడానికి మాత్రం 
నేనెన్నో వదులుకున్నాను

ఆలవాట్లు ,అభిరుచులు , 
సంప్రదాయాలు ,కట్టుబాట్లు 
స్నేహాలు , బంధుత్వాలు 
మీ అందరు నిష్కల్మషంగా చూపించే ప్రేమలు ....

ఇలా అన్నీ వదులుకున్నాకా 
తిరిగి ఎన్ని పొందాననుకున్నారు 
కట్నం లేకుండా మొగుణ్ణి పొందానన్న 
అత్తగారి వ్యంగ్యాభినందన ..

లేచిపోయివచ్చినందుకు 
చూపులతోనే సరిహద్దు చూపే 
ఆడపడుచు అభిశంసన ...

కట్టుకున్నవాడి కోసం 
అహం వద్దు ఆత్మాభిమానం వద్దని
చిరునవ్వుని అరువుగా తెచ్చుకొని 
నలుగురిలో కలుద్దామనుకుంటే ...
రోజూ ఇవన్నీ పొందుతున్న 
నాకెన్ని ఆనందభాష్పాలు 
వస్తాయో కదమ్మా ...

ఆ భాష్పాలు తుడిచే నాథుడు
రాత్రి అనునయించే మాటలు 
అప్పటి వరకే .. మరి బెట్టు చేస్తే 
వాళ్ళతో కాదు నాతో సంసారం 
నేనున్నాను కదాని ...

అతనికెలా చెప్పాలి 
భర్త ఒక్కడే కుటుంభం కాదని 
అయిన కుటుంభమనే పదం 
వాడగలిగే అర్హత నాకుందా ..?

ఒక తప్పటడుగు జీవితాన్నింతగా 
ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకొని ఉంటే 
కన్నవాళ్ల కంటే మరెవ్వరూ 
సంతానం శ్రేయస్సు ఆలోచించరనే 
విషయం కూడా ఎప్పుడో అర్థమై ఉండేది ...

అయినా ఇప్పుడేం ఆలోచించిన
ఏముంది ప్రయోజనం 
నేను అనుభవిస్తున క్షోభ సబబే కదా .... 
నా స్వార్థం గురించి ఎన్ని హృదయాలకు 
నేనిలాంటి బాధ ఇవ్వలేదూ ...!? .....

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.