Followers

Wednesday, May 22, 2013

thumbnail

|| ఉద్యోగిని ... ! ||

నాపై అనుమానం ఉంటే నేరుగా చెప్పేయి
ప్రతిచర్యలో ఇలా విసుగెందుకు చూపిస్తావు ?
ఇంట్లో అడుగుపెట్టగానే సమయాన్ని చూస్తావు 
అడగక పోయినా నీ చూపులను అర్థం చేసుకోలేనా .... !?

ఉన్నత చదువుంది ఉద్యోగం చేయమని
ప్రోత్సహించింది నువ్వే .. కాదన్న ఒప్పించింది నువ్వే ..
నేను కాలక్షేపానికి పోతేకదా
నువ్వనుమానించాలి .... !?

నా ఉన్నత చదువుకు
పట్టా చూపించగలిగాను కానీ ,
ఉన్నత వ్యక్తిత్వానికి
ఆధారం ఎలా చూపించను.... ! ?

తాళి కట్టావు నా భారం మోస్తావని
ఇప్పుడు బరువయ్యానా .. బయిటికి పంపిస్తున్నావు ?
నా భారాన్ని తగ్గిస్తున్నానో .. నీ అనుమాన భారాన్ని
మోస్తున్నానో అర్థమే కావడం లేదు .... !!

ప్రతి మాటలో ద్వందర్థాలు , ప్రతిచర్యలో హృదయానికి గాయాలు ...
నువ్ చూసిన వాళ్ళలో ఎవరు
నీకు చనువిచ్చారో తెలియదు గాని
ఉద్యోగం చేసే అందరూ స్త్రీలు అలా ఉంటారనుకుంటే ఎలా ?

వీధిలో తల వంచుకొని
వెళ్ళక పోయినా
మనసుపై మాలిన్యం అంటకుండా
నడుచుకొనే ఎంతమంది లేరు ? ...

ఎంత నర్మగర్భంగా అంటావు
పరపురుషుడితో ఏది మాట్లాడినా
ఆకర్షణ , చనువు పెరిగి ,
ఏదో రోజు అనర్థాలకు దారితీస్తుందా ….. ! ?

నీకు తెలియదేమో స్వాభిమానం ఉన్న స్త్రీ
ఏ పరపురుషుడితో మాట్లాడిన
వేళ్ళతో కాదు చూపులతో సరిహద్దు గీస్తుంది
మనసుతో కాదు నాలుకతో మాట్లాడి
ఎదుటివాడి మనసులో రాబోయే వికృత భావాన్ని చంపేస్తుంది .... !!

మనస్బంధనం పవిత్రతను నువ్వు ఎలాగో విశ్వసించడం లేదు
నా పదవి విరమణ దాకా నీ అనుమానం ఎలాగో వీడదు ..
పోనీ ఒక పని చేస్తావా నీ అనుమాన నివృత్తి కోసం ....
ఏదైనా ఒక శారీరక బంధనం రూపొందించు నువ్వు మాత్రమే విప్పగలిగే .... .... !!

Sunday, May 19, 2013

thumbnail

కొన్నిసార్లు ...

కొన్నిసార్లు ఆనందావిషాదాలే కాదు  
కృతజ్ఞతా భావం కూడా
భాష్పాలను రప్పిస్తూ ఉంటుంది
ఎదుటివారి సహృదయతకో..  
తన నిస్సహాయతకో..  !!
 
కొన్నిసార్లు ఏదో ఒక వాక్యం
జ్ఞాపకం వస్తూ ఉంటుంది
హృదయంలో నిక్షిప్తమై ఉన్న ఆవేదన  
వాక్యంలో కనిపించినందుకో ..  
వాక్యంతో  ప్రేరణ పొందినందుకో  .... !!
 
కొన్నిసార్లు ఏదో ఒక వదనం 
జ్ఞాపకం వస్తూ ఉంటుంది
అద్వితీయమైన సౌందర్యానికో ..  
స్వప్నాల్లో కన్పించే రూపం
బాహ్యంలో కనిపించినందుకో  .... !!
 
కొన్నిసార్లు నగ్నతే  కాదు
ఇతర కారణం సిగ్గును కలిగిస్తూ ఉంటుంది
తప్పుచేస్తూ తమ వారి దృష్టిలో పడినందుకో..  
శత్రువు అనుకున్న వాళ్ళే
అవసరంలో ఆదుకున్నందుకో  .... !!
 
కొన్నిసార్లు తప్పు చేసాకే  
హృదయం జాగృతమవుతుంది
తన తప్పు వలన బలైన వారి దుస్థితి చూసాకో
తప్పు శాపమై తనవారిని
చుట్టుకున్నందుకో .... !!
  
కొన్నిసార్లు కవిత ఎంత బాగున్నా
అయిష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది
కవిపై ఏర్పడి ఉన్న తేలిక భావానికో  
జీర్ణించుకోలేని అహం భావం
మన ( సు ) లో ఉన్నందుకో  .... !!
 
 

Friday, May 17, 2013

thumbnail

నేర్చుకోని .... !!

 
మొదటి చూపులోనే
నీ స్నేహ హస్తాన్ని ఎలా కోరను ... ?
నీ దృష్టి పడగలిగే
స్థాయి నాకు రాని ..... !!
 
నీతో నిస్సంకోచంగా
ఎలా మాట్లాడను ... ?
ముందు నా  
అక్షరాభ్యాసం పూర్తికానీ .... !!
 
నీతో సమాంతరంగా
ఎలా నడవను ..... ... ?
తప్పటడుగుల
దశ నన్ను దాటని ..... !!
 
ఆకాశంలో విహరించే
స్వప్నాన్ని ఎలా చూడను ... ?
నేలపై పడిపోకుండా
ఏదైనా ఆధారం చూడని ..... !!
 
ప్రేమించాలనే భావన
ఎలా పెంచుకోను ... ?
ముందు ఒంటరితనపు
అలవాటు కాని ..... !! 

Wednesday, May 15, 2013

thumbnail

అజ్ఞాత స్నేహంనువ్వు అజ్ఞాతంగానే ఉండు నేస్తమా
వాక్యాల వారధి ఉందిగా  .. నీ ఉనికితో నాకేం పని !?
నీ వదనంపై ఎవరిదైనా ముసుగు వేసుకో
ఆత్మసౌందర్యాన్ని చూస్తాను  ..
నీ బాహ్య సౌందర్యంతో నాకేం పని
నా అభిమానంలో
అనుమానాన్ని అన్వేషించకూ
పరిధి అతిక్రమిస్తే కదా
నువ్ అనుమానించాలి
ప్రతివారు చెప్పేది ఇదేగా అనుకుంటే
కనిపించదా నిజం చనువును హద్దుల్లో ఉంచిన
నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే ...
అనుకుంటావేమో ..అభిమానానికి స్త్రీ అనే కారణం  .. కావచ్చుగా !
 అదే నిజమని కాదు కొంత నీలోని భావుకత కూడా ఉండొచ్చుగా . !  
అంటావేమో .. దూరం చేస్తే అభిమానం మర్చిపోవచ్చుగా
ఇప్పుడేం దగ్గరగా ఉన్నామా నే  సందేహం నాకు రావచ్చుగా  ! 

Sunday, May 12, 2013

thumbnail

త్యాగమయి
నీ పాదాల  క్రింద ఉన్న స్వర్గాన్ని
విధాత తీసుకోలిచాడు
దానికి బదులుగా ఏమైనా కోరుకో
అన్నాడు  దైవదూత మాతృమూర్తితో .... !!
ఇచ్చింది విధాతే ...  అడగకుండానే
తీసుకొమ్మను ... అంది చిరునవ్వుతో !!
విధాత అంతా స్వార్థపరుడు  కాదు
ఏదైనా తీసుకుంటే 
మరొకటి ఖచ్చితంగా ఇస్తాడు
ఏదైనా కోరుకో .....  !!
ది విని మాతృమూర్తి అంది దరహాసంతో
స్వర్గమే కాదు నా ఆయస్సు ను
కూడా తీసుకోమను . కానీ ,
నా సంతానం నుదుటిరాతను
స్వయంగా నేనే రాసే
అవకాశాన్ని ఇవ్వమను ... !!
Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.