Followers

Sunday, September 29, 2013

thumbnail

!! తల్లి మనసు .... !!



గర్భంలో ఒక చర్య మొదలవగానే 


నువ్వే ఉండాలని మనసులో ఉన్నా


నిజంగా నువ్వే ఉన్నావేమో అని 


భీతి కూడా చెందుతుంది 




ఎవరో ఏదో అంటారని భ్రమపడుతూ 


నీకో ఆకృతి రాక ముందే 


మనసును చంపుకొని


శల్య పరీక్షలు చేయిస్తుంది 



దైవ నిర్ణయాన్ని కాదనుకొని 


మెట్టినింటి వారి మెప్పు కోసం


నిన్ను విసర్జించాలని 


అనివార్యంగా ప్రయత్నిస్తుంది 



ఆ తొలి పోరాటాన్ని జయించి 


నువ్వు లోకానికొచ్చాకా 


ఆర్తిగా హృదయానికి హత్తుకున్న


నేరం చేసిన దానిలా 


ఎవరి కళ్ళల్లో చూడలేక పోతుంది 




నీ ఆడపుట్టుకకు కారణం


తను కాకపోయిన ,


అందరికది తెలిసిన


నేరం తనపై వేసుకుంటుంది 




నిన్ను స్వేచ్చగా పెంచాలని తనకున్నా 


అనివార్యంగా ఆంక్షలు పెడుతుంది 


నువ్వొక ఇంటిదానివయ్యే వరకే కాదు 


నువ్వొక జన్మ ఇచ్చేవరకు 


నీకోసమే పరితపిస్తుంది




తనకు అమ్మాయి పుట్టాలని 


ఎంతగానో కోరుకున్నా ఆ తల్లి 


నీ సమయం వచ్చేసరికి 


మనసును మార్చుకుంటుంది 




నీకు అబ్బాయే పుట్టాలని 


ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది 


తను పడిన బాధలు 


నువ్వు పడకూడదనుకుంటుంది 


ఎందుకంటే తనది ఒక తల్లి మనసు .....
 



Friday, September 27, 2013

thumbnail

!! అమరత్వం ... !!




నేనిప్పుడు అట్టడుగులో ఉన్ననేమో
నేనెగరేసిన పతాకమొకటి శిఖిరంపై
నేటికీ రెపరెపలాడుతూనే ఉన్నది

నేనిప్పుడు మొలకెత్తనేమో
ఒకప్పుడు నాటబడి వృక్షమైన నా అంశం
నేటికీ కూడ నీడ ఇస్తూనే ఉన్నది

నేనిప్పుడు నడవలేనేమో
నేను దాటి వచ్చిన మైలురాళ్ళు
ఎందరికో స్పూర్తి ఇస్తూనే ఉన్నాయి 

నేనిప్పుడు మూగపోయిన స్వరాన్నేమో
నేనాలపించిన గానాలెన్నో
ఎంతోమంది హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి

నేను సజీవుణ్ణి కానేమో
స్మారకశిలలో ఉన్న నాపేరు
ఎందరినో జాగృతం చేస్తూనే ఉన్నది

నేను గతంగా మిగిలానేమో
నాకంటూ ఉన్న చరిత్ర
సజీవంగా నన్ను నిలబెడుతూనే ఉన్నది


Tuesday, September 17, 2013

thumbnail

!!ఆలోచించూ ... ..!!

కవిగా ఒక పేరు 
నలుగురు ఆప్తుల్ని 
సంపాదించుకున్నావు కదా 

ఇక చాలు ..ఎలాగైనా రాయి
ఒక వాక్యం రాయి ..
ఎక్కువనిపిస్తే ఒక పదమే రాయి

నీకెంత పేరుందంటే
నీ ఒక్కో అక్షరాన్ని
కొన్ని లైకులు , కొన్ని ఆహా ..ఓహో లిచ్చి
చదివే అభిమానులకు కొరతలేదు

ఏదో చంద్రుని బొమ్మ వేస్తావు
ప్రేయసి హృదయం అంటావు
ఆకులు ఎండటాన్ని ..రాలడాన్ని రాస్తావు
నా జీవితం శిశిరమంటావు

రక్తంతో గడ్డిని తడుపుతాను .. నీ పాదాలకు గుచ్చుకోకుండా
రాస్తావు ..భావుకత అంటావు
నీ వృత్తి పరమైన అంశం రాస్తావు
పదాలు అర్థం కావడం లేదంటే నాలెడ్జ్ లేదంటావు

ఇప్పుడు నీకింత మార్కెట్ ఉందంటే
నువ్వేది రాసిన నడుస్తుంది ..
కాదు పరుగెత్తుతుంది
ఇప్పుడు నీకు సామాజిక అంశాల గురించి ఏమవసరం ?

మత ప్రాంతాల ఘర్షణల గురించి
భూటకపు ఎంకౌంటర్ల గురించి
సామాజిక రుగ్మతల గురించి
నిరక్షరాస్యత గురించి ... మూఢ నమ్మకాల గురించి
చైతన్య పర్చడానికి రాయడం
ఇప్పుడు అవసరం లేదేమో ...
.
నీకు జై ..జై అన్న వాళ్లే ఉండి
ఇక ఆపేయ్ అన్న వాళ్ళు లేనంత కాలం
పేజీ ఫ్రీ కదా అని నువ్వు ఎలాంటిది రాసిన
నాకు లైక్ కొడుతున్నాడు కదా
అని కొందరు పట్టించుకొనంత కాలం
నువ్వు సమాజం గురించి పట్టించుకోవు

నీలో అంతర్లీనంగా ఎంతో శక్తి ఉంది ..
నీ ఒక్కో అక్షరంతో అందరిలో కాకపోయిన
కొంత మందిలో కాస్తైన చైతన్యం తెగలవూ
ఆలోచించూ ... ఆ దిశలో కలాన్ని సంధించూ .... 

Monday, September 16, 2013

thumbnail

ఎవరు గుర్తించుకుంటారు ?





నువ్వెవరినైతే మర్చిపోతావో

అతన్ని ఎవరు గుర్తించుకుంటారు ?

ఎవరికైతే నువ్వు జ్ఞాపకం ఉంటావో

అతను మరొకరినెలా గుర్తించుకుంటాడు ?


**** **** **** **** ****

నీ ప్రేమ అదృష్టం లాంటిది

నిన్ను ఇవ్వచ్చు .. ఇవ్వకపోవచ్చు

కానీ , నువ్వు ఒకప్పటి నేస్తానివనే

భావన మాత్రం స్వాంతన ఇస్తుంది


**** **** **** **** ****

నా జీవితంలో కేవలం రెండే విషయాలు

అసంభవంగా కనిపిస్తాయి

నిన్ను పొందగలిగే అభిలాష .. మరవగలిగే ఆశ


**** **** **** **** ****

మృత్యువు కేవలం

పేరుతోనే భయపెడ్తుంది

నిజానికి నీ ధ్వేశమే

దానికన్న ఎక్కువగా హింసిస్తుంది 


**** **** **** **** ****

నీ శరీరమే కావాల్సి ఉంటే

నిన్నెలాగో పొందే శక్తి నాలో ఉంది

కానీ దేవుణ్ణే ఎందుకు ప్రార్థిస్తున్నానంటే

నీ ఆత్మపై ఆధిక్యత కావాలి


**** **** **** **** ****

కన్నీరు ప్రపంచంలో

అన్నిటికంటే విలువైనది

కానీ దాని విలువ ఎవరు గుర్తించరు
..
ఎప్పటివరకైతే తమ కంటి నుండి కారదో ....!!



thumbnail

ఇక ఎవరిని విశ్వసించాలని ..!?




నీ నుండి ఎలాగో
విశ్వాసాన్ని ఆశించలేను
నాదైన హృదయం
నా కోసం కాకుండా
నీ కోసం స్పందిస్తుంది
నా ఆలోచనలు
నా భవిత గురించి కాక
నా పూజిత గురించే ఉంటాయి
నా అశ్రువులు సైతం
నా శారీరక బాధకై రాక  
నువ్విచ్చిన మానసిక 
బాధ కోసమే ఉబికివస్తాయి ...
ఇక నాదంటూ ఏది మిగిలిందని

ఇక ఎవరిని విశ్వసించాలని  ..?

Saturday, September 14, 2013

thumbnail

!! శిశిర దశ ..... !!



నా జీవన వృక్షంలోంచి 
ఆకులు 
కొన్ని పండి 
కొన్ని ఎండి 
నను వీడాయి 


విచిత్రంగా ఒక పచ్చని ఆకు 
సైతం రాలిపోయింది 


పండిన , ఎండిన ఆకులేలాగో 
రాలుతాయని తెలుసు
కానీ పచ్చని ఆకు రాలిపోవడం
విభ్రాంతికి గురి చేసింది 


ఆవి నిత్య యవ్వనంలా ఉండాలని
నా వేర్ల బలాన్ని లాగి
ఆకుల పచ్చదనానికిచ్చాను
ఆహ్లాదాన్ని .. నీడను ఇస్తాయనే నమ్మకంతో ... 


నిర్లక్ష్యం చేసిన వేర్లు అలానే ఉన్నాయి
నమ్మకం ఉంచిన ఆకే రాలిపోయింది 


అయినా రాలిపోయిన ఆకును ఎందుకు నిందించాలి
ఒకప్పుడు నాకు పచ్చదనాన్ని ఇచ్చిందే కదా ...


ఎందుకో శుస్కహాసం వస్తుంది
నమ్మకం ఉంచేవి వీడిపోతాయి
నిర్లక్ష్యం చేసినవి నిలబడేందుకు ఆసరా ఇస్తాయి
మళ్ళీ చిగురిస్తాననే స్థయిర్యాన్ని కలిగిస్తాయి 


ఇప్పుడేది ఆలోచించిన అర్థమే లేదు
నా శిశిర దశ ప్రారంభమైయింది కదా ....



Friday, September 13, 2013

thumbnail

!! నీ మనసు ..... !!




నీ మనసు  నీ కోసమే ఉన్నప్పుడు
అదొక నెమ్మదిగా పారే తరంగిణి
నీ మనసుకు ఎవరైనా ఆహ్లాదం కలిగించినపుడు
అదొక సంధ్యా సమీరము
నీ మనసు ఎవరి కోసమో స్పందించింపుడు
అదొక  పరవళ్ళు తోక్కే ప్రవాహము
నీ మనసు ఒకరి సాంగత్యం కోసం తపించినపుడు
అదొక  దేన్ని లెక్కచేయని జలపాతం
నీ మనసు  ఒకరిపై అలిగినపుడు
అదొక ఉధృతంగా పారే సెలయేరు
నీ మనసు  ఒకరి విరహంలో ఉన్నప్పుడు
అదొక పద్మాలతో నిండిన టాకము
నీ మనసు  ఒకరిపై కోపంతో ఉన్నప్పుడు
ఉవ్వెత్తున ఎగిసి తీరాన్ని దాటే కెరటం  
నీ మనసు  ఒకరిని త్యజించింపుడు

అదొక అంతు తెలియని గంభీర సాగరం  

Thursday, September 12, 2013

thumbnail

నీ పేరు ఎలా చెప్పనూ ...




కళ్ళలో 

నిద్రలేమి ఎరుపు

వదనంలో 

తగ్గిన మెరుపు

ఏదో కోల్పోయినట్టు

చూపులు

శుష్కించిన

అధరాలు

చెదిరిఉండే

కురులు

పరధ్యానంగా ఉండే

మనసు

యవ్వనంలోనే వృధాప్యంగా కనిపించే 

వయసు  

నా గురించి జనాల్లో 

వర్ణన ఇదేగా ....

దుస్థితికి కారణం 

ఎవరని అడిగితే

నీపేరు ఎలా చెప్పనూ ...

నా హృదయాన్ని 

చూపించడం  తప్పా .... 



thumbnail

అధరామృతం ....






తేనెటీగ అభ్యర్తిస్తూ అన్నది ...
“  నువ్వెలాగో తేనె తీసుకెళ్తావు నిన్ను అపలేను .. ఒక మనవి వింటావా .. 
ఓసారి వెళ్ళి నీ చెలి ఆధారాల రుచి చూడు ... 
దానికంటే తేనె మధురంగా ఉంటుందనిపిస్తే  ఇక్కడికి రా ...    ”

ఆ రుచి నేను చూసాను .. ఇదే మధురంగా ఉంటుంది దీన్నే తీసుకెళ్తాను 
నా మాట విని తేనెటీగ నీరసంగా అన్నది
“  నువ్వు రుచి చూసావు అందుకే ఇక్కడికి వచ్చావు ... 
తను రుచి చూపించి ఉంటే ఇక్కడికి ఎందుకొస్తావు ?


Tuesday, September 10, 2013

thumbnail

!! వాళ్ళల్లో ఒకరిగా .... !!




తెల్లారింది .. రోజులాగే ..
కనులు లోకాన్ని చూడకముందే 
మనసు నిన్ను చూసేసింది
రోజు జరిగేదదేగా ..
నిన్నటి వరకు నీ ఆలోచన
మందహసాన్ని రప్పించేది .
ఈ రోజెందుకో అది రాలేకపోయింది ..
ఇక వస్తుందనే నమ్మకం కూడ లేదు .
లేవాలనిపించలేదు . లేచి ఏంచేయాలో అర్థం కాలేదు .
అదే ఇల్లు ,అదే రహదారి , అదే కృత్రిమ చిర్నవ్వు ....
అయిన లేవకతప్పదు ..
మరొకరి వ్యామోహంలో దూరం అయింది నువ్వు ..కానీ
కొందరు ఆప్తులు కాదుగా ..
ప్రస్తుతం నా జీవితం తడిసిన కాగితంలా ఉండి
వ్రాయడానికే కాదు .. కాల్చడానికి కూడా పనికి రాకపోవచ్చు
ఒప్పుకుంటాను .. కానీ
ఏదో రోజు అది ఆరి రాయడానికి మళ్ళీ ప్రేరేపిస్తుంది ..
అప్పుడు చూద్దాము నా మనసులోని భావాలు ఎలా ఉంటాయో ,
నీలాంటి ప్రేరణ ఎవరిస్తారో ...
ఎవరు లేక అప్పటికి నువ్వే ఉంటే ..
అప్పటికే మరొకరి భార్యగా ఉండే నీ గురించే అవి ఉంటే ...
నైతికంగా దిగజారే నన్ను నేను క్షమించుకుంటాను
ఎందుకంటే ..
బాహువుల్లో ఒకరిని , భావాల్లో మరొకరిని తలుస్తూ
మానసిక వ్యభిచారం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ?

నేను కూడా ఉంటాను వాళ్ళల్లో ఒకరిగా ....
  



Monday, September 2, 2013

thumbnail

!! నువ్వు నేర్పించనిది .... !!




అనువణువు తెలిసి ఉండి 
అపరిచితులై ఉన్నాము 
ఎలా ఉండేవాళ్లం 
ఎలా అయిపోయాము ?

నువ్వు నన్ను వీడావా
నేను నిన్ను వీడానా
ఎవరు చెప్పలేకపోయిన
ఒక అస్పష్టమైన చిత్రంలా మిగిలాము

స్పష్టత ఇవ్వగలిగిన క్షమత నీలో ఉన్న
నీ అహం నిన్ను అడ్డుకుంటుంది
స్పష్టతను ఆడగ గలిగిన అర్హత నాలో లేక
సంకోచం నా హద్దు చూపుతుంటుంది

నిన్ను కోల్పోయాక
నన్ను నేను కోల్పోయానో
నేను లేని నిన్ను చూస్తూ
ఒక అందమైన భవిష్యత్తును
కోల్పోయానో అర్థమవడమే లేదు

ఇప్పుడు ఎలా అనుకున్న
తిరిగిరాని క్షణంలా నువ్వు రాలేవు
గగనాన విహరించే నిన్ను
అవనిపై నేను ఆహ్వానించలేను

నిన్ను చేరుకోవాలని
ప్రయత్నిస్తానేమో గాని
నా స్థాయికి నిన్ను
ఏనాడు తగ్గించాలనుకోను

ఎందుకంటే .. నేస్తమా !
నీరీక్షణలో సహనాన్ని
దుఖ్హంలో ఆనందాన్ని
చిరాకులో చిరునవ్వుని
బాధలో అనునయాన్ని
ఒంటరితనం బాధించకుండా జ్ఞాపకాన్ని

అలా ఎన్నో అంశాలు నేర్పి వెళ్లావు
అవసరం రాదనుకున్నావో
అవసరం రావాలి అనుకున్నావో
తెలియదు గాని నేర్పించలేనిది ఒకటే ...
మర్చిపోవడం ఎలా అని .....






Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.