Followers

Wednesday, August 28, 2013

thumbnail

!! ఎవరి తరం కాదు..... !!


ఒక చీకటి రాత్రిలో  నిద్ర నాతో అన్నది
నువ్వెప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు
సమాజాన్ని చైతన్యపరిచే కవి వా ...కాదే ..
లోకాన్ని ఉద్ధరించే శాస్త్రవేత్తవా ...కాదే
జనాల మానసిక రుగ్మతలను కోసం 
తపస్సు చేసే పుణ్యపురుషుడివా ..కాదే
మరెందుకు ఎప్పుడు ఆలోచనల్లోనే ఉంటావు ?
నీ పరిసరాల్లో ఎంతసేపటి నుండి తారట్లాడుతున్నాను
ఆవలింతల సందేశాన్ని పంపించాను
నీ కనురెప్పలపై ఆసనం వేసాను ...
ఎంతకు చలించవేం  ?
అభ్యర్తిస్తున్నావో , అదరగొడుతున్నావో తెలియదుగాని
శుష్కంగా నవ్వి భృకుటి ముడివేస్తావు
నీకు తెలియనిదని కాదు నావిలువ ...
ఎదోలోకంలో ఉంటున్నావు కదా  . అందుకే మరోసారి చెబుతాను
నాకోసం ఎంతమంది తపిస్తారు ..
నాకోసం ఎన్నెన్ని ప్రయాసలు పడ్తారు ?
నేను వాళ్ళను వరించాలని శయనానికి ,
శరీరానికి ఎన్నెన్ని అలంకరణలు చేస్తారు ?
నేనప్పుడు స్వయంవరం ప్రకటించకుంటే
మందుకో , మాత్రకో నన్ను లొంగదీసుకుంటారు
అయిన వాళ్ళకు నా పరిపూర్ణ సౌఖ్యాన్ని ఇవ్వను
నీకు తెలియదేమో నేను మనస్ఫూర్తిగా వరిస్తే
ఎన్ని రూపాల్లో సౌఖ్యాన్ని ఇస్తానో
తల్లిలా లాలిస్తాను
భార్యలా మురిపాలిస్తాను
ప్రేయసిలా అనురాగాలిస్తాను
నిస్వార్థంగా అన్నీ ఇచ్చే నన్ను చూడగానే
ప్రియురాలిని స్వయంగా మరొకరి 
శోభనం గదిలో పంపిస్తున్నట్టు  మొఖం పెడ్తావు
నా విలువ తెలిసి కూడ అలా చేస్తావు ..
నువ్వు భగ్నప్రేమికుడివని చాలా అవకాశాలు ఇస్తాను
కానీ విసిగిపోయానా  నిన్ను వరించకుండా ఆపడం నీ తరం కాదు
నన్నాపే ప్రయత్నం చేస్తే  కసిలో నిన్నింతగా హత్తుకుపోతానో
నా నుండి నిన్ను విడదీయడం ఇక ఎవరి తరం కాబోదు ...
Sunday, August 25, 2013

thumbnail

!! నా అక్షరాలు .... !!

నా అక్షరాలు
అలంకరణల ముసుగులో
అందంగా లేకపోవచ్చు
ఉంటాయవి పారదర్శకంగా
నా మనసులా కదా ..

నా అక్షరాలు
కొందరికి జీర్ణం కాలేక
ఇబ్బంది పెట్టవచ్చు
వారికి సమాధానలే కానీ
నా స్వ భావాలు కావు కదా ..

నా అక్షరాల్లో
కొంత మర్మం
దాగి ఉండవచ్చు
మరి నగ్నంగా చెబితే
ఎవరు హర్షించరు కదా ...  

నా అక్షరాల్లో
కొంత అతి కనిపించవచ్చు
ఒకేలా ఉండని
మనస్తత్వాలపై కూడా
దృష్టి పెట్టాలి కదా ..

నా అక్షరాల్లో
హృదయాభగ్నతే ఎక్కువేమో
భావుకతను శ్వాసించే
మనసుకు అంతకన్నా
ఇంకేం వస్తుంది కదా  ....

నా అక్షరాలు
వెన్నెల్లో ఆడుకొనే
ఆడపిల్లలు కాకపోవచ్చు
ఒక్కోసారి గ్రీష్మంలో
ఆహ్లాదాన్నిచ్చే చిరుజల్లులు కదా ...

Saturday, August 24, 2013

thumbnail

!! నాదేమున్నది .. !? .... !!
ప్రశాంతంగా ఉన్న మనసులో 
అలజడి రేపిన పిలుపు నీదే 
మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలన్న
ఆసక్తి కలిగించిన చూపు నీదే

వసంతాల అనంతరం ఆహ్లాదం
కలిగించిన స్మరణం నీదే
వైరాగ్యంలో అనురాగం
వినిపించిన చరణం నీదే


అధరాలపై  లాస్యం
రప్పించిన హాస్యం నీదే
జీవితంపై అనురక్తి
కలిగించిన భాష్యం నీదే

కాసేపలా కలసి నడుద్దామని
సూచించిన ఆ రహదారి నీదే
పయనం ఎంతవరకనేది
చూపించిన ఆ గమ్యం నీదే

అలసి నిలబడిపోతే
నడిపించిన చేయూత నీదే
స్వేదం కారుతుంటే
ఆర్తిగా తుడిచిన సహృదయత నీదే

గమ్యం సమీపిస్తునప్పుడు
అకస్మాత్తుగా పెరిగిన వేగం నీదే
సమాంతరంగా నడవలేనప్పుడు
నెమ్మదిగా నను విడిచిన వేలు నీదే

నేను ఆగిపోయినపుడు
వెనక్కి చూడలేని నిర్ణయం నీదే
నువ్వు ముందుకు వెళ్లిపోయాక
నా పరిస్థితి పట్టించుకోని మౌనం నీదే

ఎప్పుడో వెనక్కి చూస్తావన్న
నాలో ఉన్న ఆశ నీదే
ఏనాటికైనా తిరిగివస్తావన్న
నాలో ఉన్న నమ్మకం నీదే ....
Thursday, August 22, 2013

thumbnail

!! మట్టి బంధం ...... !!
నువ్వింత ఏహ్యంగా చూస్తున్నావే
మరిచిపోయావా ?..
నా నుండే పుట్టావని ...
నాపైనే తప్పటడుగులు నేర్చుకున్నావని ....
నా పలక పైనే ఓనమాలు దిద్దావని ...
ఆ ఓనమాలతోనే ప్రగతి సాధించావని ...
ఆ ప్రగతిని నాపైనే ప్రయోగిస్తూ
నా ఉనికి దాచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావే ...
నేనంటే ఇప్పుడు నీకు చిరాకు కలుగుతుందా ?
నాపై నడవటానికి సంకోచిస్తున్నావు
నీ పిల్లల్ని ఆడుకోవద్దని ఆంక్షలు పెడుతున్నావు
నేనెవరికైనా హాని చేసానా ?
నాలో నిరంతరం ఆడుకొనే కర్షకులు
ఎప్పుడైనా వ్యాధిగ్రస్తులయ్యారా ?
కార్మికుల పసిపిల్లలు నా ధూళినే మొఖానా అద్దుకుంటారు
మీ పిల్లల్లాగా తరుచూ ఆస్పత్రి మొఖాలు చూస్తారా ?
కృత్రిమ వాసన ఇష్టపడుతుంటావే గాని
తొలకరిలో నా సువాసన ఆస్వాదించలేకపోతున్నావు ..
నేనెంత మేలు చేసినా ..నాకు కీడే చేస్తున్నావు
నా స్థన్యాన్ని పీల్చి నాలోని రక్తాన్ని తోడేస్తున్నావు
నేను మళ్ళీ పుంజుకొనే శక్తి రాకుండా
వర్షాలను దూరం చేస్తున్నావు ...
నాలో సహనం నశించి
మీ విసర్జనాలను , మీ మాలిన్యాలను , మీ క్రుళ్లు శరీరాలను
నాలో ఐక్యం చేసుకోకుండా ఉంటే క్షణమైనా ఉండగలరా ?
నను తాకొద్దని ఎత్తైన అంతస్తుల్లో ఉంటున్నారే
మర్చిపోవద్దు ఏనాటికైనా ఐక్యమయ్యేది నాలోనేనని ....
నువ్వు వద్దన్నా మన అనుబంధం ఏనాటికి  అంతం కానిదని ...

Monday, August 19, 2013

thumbnail

!! ప్రేమ విఫలమైతే ....!? !!
కనురెప్పలు భారంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు మా ఇద్దరినీ పెనవేసుకొనివ్వవు
కనికరించి కలుసుకొనివ్వు 
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...

కనులు నిస్తేజంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు శూన్యంలో చూస్తూ గడపాలి
మేము నిర్జీవం కాక ముందే ఏదో ముసుగు ఇవ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...

అధరాలు నిర్వేదంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు రుచి లేకుండా ఉంచుతావు
శుష్కించక ముందే ఏదో తడినివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...

హృదయం విదారకంగా అంటుంది
ఇంకెన్నాళ్ళు స్పందిస్తూ ఉండాలి
నువ్వు అలసిపోవు నాకైనా విశ్రాంతినివ్వు
నీ ప్రేమ విఫలమైతే నాకెందుకీ శిక్ష ...

దేహం కూడా చివరికి హెచ్చరిస్తూ అంటుంది
నా భాగాలు కొన్ని నీతో చెప్పి .. కొన్ని చెప్పలేక పోతున్నాయి
నువ్వు అన్నిటిని త్యజిస్తూ ఉంటే
ఇక నీ ఆత్మను నేను త్యజించాల్సి వస్తుందేమో ...


thumbnail

విధ్వంసమే ....

    


ఒక రసాయినిక పదార్థం విస్ఫోటించినపుడు అత్యంతా వేగంగా అక్కడి గాలిని నెట్టేసి శూన్యంగా మారుస్తుంది . ఆ వేగానికి సర్వం కొట్టుకుపోతాయి . మళ్ళీ ఆ శూన్యాన్ని పూరించడానికి  గాలి అదే వేగంతో వెనక్కి వచ్చేస్తుంది .
      వస్తు .. వస్తూ అన్నిటిని నెట్టుకుంటూ వస్తుంది ..
       గాలి వెళ్ళినా , వెనక్కి వచ్చిన చేసేది మాత్రం విధ్వంసమే ....
       ఇలాగే .....
      నా హృదయం విస్ఫోటించినపుడు  అత్యంత వేగంగా నిన్ను తన నుండి నెట్టేసి శూన్యంగా మార్చింది  . ఆ వేగానికి నీ అనురాగం , అభిమానం , అవమానం అన్నిటిని కొట్టుకుపోయింది  . మళ్ళీ ఆ శూన్యాన్ని పూరించడానికి అదే వేగంతో అన్నిటిని నెట్టుకుంటూ నీ జ్ఞాపకాలను తీసుకొచ్చింది .  
      నువ్వు  వెళ్ళినా , నీ జ్ఞాపకాలను వెనక్కి తీసుకువచ్చిన జరిగేది మాత్రం మానసిక విధ్వంసమే ....
 
Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.