Followers

Thursday, August 8, 2013

thumbnail

!! నా జీవితానివి ... !!



ఓసారి నువ్వడిగావు 
ఒక అందమైన కవిత రాయవా ..? 
బాహ్య స్వరూపం గురించా 
ప్రకృతి గురించా లేక 
మన ప్రణయం గురించా ...
దేని గురించి వ్రాయాలి ..? 
అసలు అందం అంటే 
నిర్వచనంగా దేన్ని తీసుకోవాలి ... ? 
అందం అంటే నీ నిర్వచనం వేరు 
నా నిర్వచనం వేరు 
నా దృష్టిలో అందమంటే ....
నాగలి దున్నివచ్చిన రైతుకు అతని ఆలి కొంగుతో స్వేదం తుడుస్తుందే అది
సరిహద్దుకై వెళ్తున్న సైనికుడికి వీడ్కోలు ఇస్తూ తల్లి చూస్తుందే అది
కసాయివాడితో వధశాలకు వెళ్తూ దూడ వైపు గోవు చూస్తుందే అది
అరబ్ షేఖ్ తో వెళ్తూ తన చిన్నారి చెల్లెళ్లను పసితనం వీడని అక్క చూస్తుందే అది
ఇంకా చాలా ఉన్నాయి .. కానీ అవన్నీ నీకు ఆహ్లాదాన్ని ఇవ్వవు
నీ దృష్టిలో అందమంటే ...
అంతరంగం ఎలా ఉన్న కంటికి ఇంపుగా కనిపిస్తారే అది ...
మనసులో ఏ మాలిన్యం ఉన్న తీయగా మాట్లాడుతారే అది ..
రహదారుల్లో నీ పాదాల్లో పూలు పరుస్తారే అది
నీలానే నాటకీయంగా ప్రవర్తిస్తూ జీవిస్తారే అది
ఇంకా చాలా ఉన్నాయి .. కానీ
అవన్నీ నీ ఆహాన్ని గాయ పరుస్తాయి
నువ్వు ఆకర్షణను అందం అనుకుంటావు
నేను కరుణ , ఆర్ద్రత , నిస్సహాయతలో అందాన్ని వెదుక్కుంటాను
సరే .. నా దృష్టిలోని అందాన్ని నీపై ఎలా రుద్దనూ ...?
నీ దృష్టిలోని అందం గురించే చూద్దాం
మన ప్రేమను ప్రకృతితో పోల్చి అందంగా రాయనా ...
వద్దులే ...
ప్రకృతి సదా ఒకేలా ఉండదు..
ఎన్నో సార్లు ప్రకోపిస్తుంది
మన ప్రేమను నువ్విష్టపడే
ఒకరి బాహ్యస్వరూపంతో పోల్చనా
వద్దులే ...
ఆ స్వరూపం ఎన్నో రూపాలను
మారుస్తూ స్థిరంగా ఉండదు
ప్రకృతిని , బాహ్య స్వరూపాన్ని
దేనితో పోల్చిన అవి స్థిరంగా ఉండవు
ఒక్కోసారి వినోదంగా .. ఒక్కోసారి విషాదంగా ఉంటాయి
అందుకే అస్థిరమైన వాటితో పోలికే వద్దు
ఎప్పుడు స్థిరంగా ఉండే మన ప్రేమను ప్రేమ తోనే పోల్చి
నీకోసం ఒక అందమైన కవిత రాస్తాను .. సరేనా ...

నా మనసులోని ఆవేదనను కనిపించకుండ ఉంచే నువ్వు
నా మందహాసానివి
వర్ణంలేని చిత్రాన్ని కూడ ఎన్నో వర్ణాల్లో చూపించే నువ్వు
నా నేత్రానివి
నా భావాలు ఎలా ఉన్న సవరించి శృతి చేసే నువ్వు
నా సంగీతానివి
అస్తవ్యస్తమైన ఆలోచనలను స్థిరంగా ఉంచే నువ్వు
నా హృదయానివి
ఏది చెప్పకుండా మర్మంగా సంభాషించే నువ్వు
ఎలా ఉన్నా ... నా జీవితానివి ...

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

14 Comments

avatar

chaalaa baagundi Sir...just like your any other poems:)

Reply Delete
avatar

Thank you very much sharat likhitam garu

Reply Delete
avatar

మహిది సర్
అందానికి మీరు చెప్పిన నిర్వచనం మనసుకు హత్తుకుంది ... మొదటి సారి ఒక కవితను పది సార్లు చదివాను ( అర్థం కాలేదని కాదు ) .. అందంగా , ఆసక్తిగా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా .. .. ఇలాగే రాస్తూ ఉండాలని ....

Reply Delete
avatar

అందం అంటే బాహ్య సౌందర్యం కానే కాదు. మనసు పొరల్లో దాగి ఉండె అందాన్ని ఆరాధించే వ్యక్తులు నిజంగా అభినందనీయులు. అందం ఏ సినిమా హిరొయిన్ అంగాంగ వర్ణనల లొనో, ఆకర్షదాయక హంగుల్లొనో ఉండదు. కరుణ, ఫలితం ఆశించని ప్రేమ, శాంతి, సుగుణాలలోనే అసలైన అందం ఉంటుంది. మంచి కవిత రాసినందుకు అభినందనలు.

Reply Delete
avatar

మీ అందమైన వాఖ్యకు అభినందనలు ... మనలాగే అందరూ ఆలోచించరు . ఒక ఉధా : ఒకరు చెప్పారు ఎవరైతే అందంగా ఉండరో వాళ్ళే ఇలాంటి ఆత్మ వంచన చేసుకుంటారట .. బహుశ నాగురించే చెప్పిందేమో .. .. ఎనివే థాంక్స్ ..

Reply Delete
avatar

నిజంగా అందానికి నిర్వచనం అదేనంటారా లేక పలికేదొకటి మదిలో ఒకటంటారా?

Reply Delete
avatar

Thank you very much Srujana garu ..

Reply Delete
avatar

"అస్తవ్యస్తమైన ఆలోచనలను స్థిరంగా ఉంచే నువ్వు
నా హృదయానివి
ఏది చెప్పకుండా మర్మంగా సంభాషించే నువ్వు
ఎలా ఉన్నా ... నా జీవితానివి"
ఇది చాలు మీరు ఆమె ఒకటి అన్న భావనకి.:-)నైస్ ఫీల్!

Reply Delete
avatar

అనికేత్ గారు
అందానికి నిర్వచనం ఎవరు పరిపూర్ణంగా చెప్పగలిగారని .. నేను చెప్పడానికి .. ? ..ఎవరేం చెప్పిన వారి వారి మనస్తత్వాన్ని బట్టి , వారి అభిరుచిని బట్టి వారి అనుభవాలను బట్టి చెప్పారు . నిజాయితీగా చెప్పాలంటే నేను అందంగా ఉండను .. ముసుగులో ఉంటాను కాబట్టి అందానికి ఆ విధంగా నిర్వచనం చెప్పాను .. నా ఆత్మవంచనే కావచ్చు .. నేను పలికేది ఏది అయిన మదిలోనిది కూడా నిజాయితీగా బహిర్గతం చేస్తాను .

Reply Delete
avatar

మీరు మెచ్చినందుకు ధన్యవాదలు పద్మార్పిత గారు

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.