నా చిట్టితల్లి ... మనింటి వాతావరణం
ఎవరో మరణించినట్టుగా ఉంది రా !
ఉండదా మరీ ..?
కూతురు పారిపోయిన ఇంట్లో
విశ్వాసం , గౌరవం , స్వాభిమానం లాంటి
ఎన్ని శవాలు లేస్తాయని ..... .. !?
నువ్వు గడప దాటినప్పటినుండి
గడపను మేము దాటలేకపోయాము
బంధువులు , సన్నిహితులు
పరామర్శించి పోతూ ఉన్నారు
మా పెంపకాన్ని ఎత్తి చూపుతున్నారో
నువ్వు లేచిపోవటాన్ని గర్హిస్తున్నారో
అర్థం కావడమే లేదు ..... !
అర్థమయింది ఒక్కటే ....
ఓదార్పు కూడా ఎంత చేదుగా ఉంటుందో !
నువ్వు వెళ్లింది అదృష్టవంతుడి దగ్గరికేమ్మా
పద్దెనిమిదేళ్ళ మాప్రేమను
ఓడించిన వాడు అదృష్టవంతుడే కదా !
నువ్వు మాత్రం దురదృష్టవంతురాలివి ...
మా అనురాగాలు నిష్కల్మ్శమైన మా హృదయాలు
నిన్ను వెంటాడుతూనే ఉంటాయి వేటిని నువ్వు గెలవలేవు !
ఎవరో ఏదో అంటారని
మేము నీకోసం అన్వేషించము
నివాసానికి రప్పించుకున్న
మా మనసుల్లో నిన్ను పునః ప్రతిష్టించుకోలేమురా !
నేనేమంటానోనని మీ అమ్మ వణికిపోతుంది
పిచ్చిదానికి తెలియదు నామాట పడిపోయిందని ....... !
ఇప్పుడున్న పరిస్థితిని భరించగలను కానీ ,
ఏ రోజు నా ఎదుట రాకురా
నాతో చూపులు కలపలేని
నీ నిస్సహాయస్థితిని నేను భరించలేను
నేను నీ తండ్రిని రా .. !
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఎందుకో ఇది చదువుతుంటే తెలియకుండానే ఒక కన్నీటి చుక్క రాలింది....కారణం అడకండి.
Reply DeleteHeart touching emotional poetry.
నా బ్లాగ్ లో మీ ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం ...
Reply Deleteభావుకత నిండిన మీ అందమైన కవితలతో , ఆహ్లాదపూర్వకమైన కామెంట్లతో అందరినీ ఉత్సాహపరిచే .. మీ హృదయానికి ఆర్ద్రత ను కలిగించిందంటే ఈ కవితలోని కొన్ని వాక్యాలకైనా సార్థకత చేకూరినట్లే ..
అర్పిత గారు ధాన్యావాదాలండి