కొన్నిసార్లు ఆనందావిషాదాలే కాదు
కృతజ్ఞతా భావం కూడా
భాష్పాలను రప్పిస్తూ ఉంటుంది
ఎదుటివారి సహృదయతకో..
తన నిస్సహాయతకో.. !!
కొన్నిసార్లు ఏదో ఒక వాక్యం
జ్ఞాపకం వస్తూ ఉంటుంది
హృదయంలో నిక్షిప్తమై ఉన్న ఆవేదన
ఆ వాక్యంలో కనిపించినందుకో ..
ఆ వాక్యంతో ప్రేరణ పొందినందుకో .... !!
కొన్నిసార్లు ఏదో ఒక వదనం
జ్ఞాపకం వస్తూ ఉంటుంది
అద్వితీయమైన సౌందర్యానికో ..
స్వప్నాల్లో కన్పించే ఓ రూపం
బాహ్యంలో కనిపించినందుకో .... !!
కొన్నిసార్లు నగ్నతే కాదు
ఇతర కారణం సిగ్గును కలిగిస్తూ ఉంటుంది
తప్పుచేస్తూ తమ వారి దృష్టిలో పడినందుకో..
శత్రువు అనుకున్న వాళ్ళే
అవసరంలో ఆదుకున్నందుకో .... !!
కొన్నిసార్లు తప్పు చేసాకే
హృదయం జాగృతమవుతుంది
తన తప్పు వలన బలైన వారి దుస్థితి చూసాకో
ఆ తప్పు శాపమై తనవారిని
చుట్టుకున్నందుకో
.... !!
కొన్నిసార్లు ఓ కవిత ఎంత బాగున్నా
అయిష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది
ఆ కవిపై ఏర్పడి
ఉన్న తేలిక భావానికో
జీర్ణించుకోలేని అహం భావం
మన ( సు ) లో ఉన్నందుకో .... !!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments