Followers

Monday, July 8, 2013

thumbnail

ఫ ( ఫా ) స్ట్ లవర్ ..

     
   (   ఒక్క మాట ...  ఆంద్రభూమి లో ప్రచురితమైన ఈ కథ నేను ఎన్నో సంవత్సరాల క్రితం రాసాను . ఇది నా తొలి కథ . కథ ఇచ్చిన ఉత్సాహం వలన తర్వాత సంవత్సరాలలో వంద కంటే ఎక్కువ కథలు , రెండు నవలలు , కొన్ని వ్యాసాలు రాసాను . దీన్ని  నా బ్లాగ్ లో  స్థానం కల్పించడానికి రెండు కారణాలు ఉన్నాయి . మొదటిది .. ఇది బాగుంది ..బాగా లేదని కాదు   ఏ వ్యక్తి అయిన తన తొలి అన్న దానిని జీవితాంతం మర్చిపోలేడు . అందుకు ... రెండవది  ఈ కథ వ్రాసిన తర్వాతే కథలో జరిగిన సంఘటనలు నా జీవితంలో  నిజమయ్యాయి నేను అత్యంత కఠినమైన కమాండో శిక్షణ పొందాను పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను .  ... కథలో ఉన్నట్టు వైద్య రంగంలో ఉన్న ఒక వ్యక్తి నా ఆప్త నేస్తమయింది.  ... ఇక ఆసక్తి ఉంటే చదవండి ... )


        
*********************************************************************************************



     ఆమె  పేషంట్ పల్స్ చూస్తూ మళ్ళీ నావైపు చూసింది . ఎప్పటిలా ఆ చూపు భావరహితంగా ఉంది . నాలో మందహాసాన్ని గమనించి మరోవైపుకు చూపులు తిప్పుకుంది . ఆ ఆస్పత్రి పేషంట్స్ బెంచ్ పై కూర్చున్న నాకు అభిముఖంగా తన గదిలో పేషంట్స్ ను శ్రద్దగా చూస్తుందా డాక్టర్ . నా వంతు వస్తున్న నేను లోనికి వెళ్లకుండా నా తర్వాత వరుస వాళ్ళను లోనికి పంపిస్తున్నాను .
    తను ఆ విషయాన్ని గమనించిన ఏ చర్యలోనూ విసుగును ప్రదర్శించడం లేదు . నేను ఆ డాక్టర్ ను తన్మయత్వంగా చూస్తుంటే అక్కడున్న పేషంట్స్ నావైపే ఆసక్తిగా చూస్తున్నారు . బహుశ ఆ గ్రామీణులు తమ ప్రాంతంలో తొలిసారిగా  బ్లాక్ క్యాట్ కమాండో ను చూస్తుండవచ్చు . వాళ్ళ గుసగుసలు నాకు వినిపించకపోయిన నాగురించే అని అర్థం చేసుకోగలను .
   రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఓ కుగ్రామం అది . తీవ్రవాదుల గురించి కేంద్రం నుండి ప్రత్యేకంగా మా స్పెషల్ కమాండో టీం వచ్చి అప్పటికే నెల రోజులు దాటిపోయింది . ఆ నెల రోజుల్లో మా ప్రయత్నంలో చాల వరకు సఫలీకృతమైయ్యామనే చెప్పాలి . వారం రోజులుగా అక్కడి పరిస్థితి ప్రశాంతంగా ఉంది .
   ఆ గ్రామీణులకు మేము కాస్త ముఖ పరిచయమయ్యాము . అప్పటివరకు కేవలం స్థానిక పోలీసులను , వాళ్ళు ఉపయోగించే ఆయుధాలను చూసిన వాళ్ళకు మా అత్యంత ఆధునిక  ఆయుధాలు , మా క్రమశిక్షణ  చాల ఆశ్చర్యాన్ని కలిగించేవేమో మా పరిసరాల్లోనే తారట్లాడేవాళ్లు . ఆ గ్రామీణులకు మాతో మాట్లాడాలన్న చాల కోరిక కనిపించేది . కానీ నాతప్పా మరెవరికి తెలుగు రాకపోవడంతో వాళ్ళ కోరిక తీరేది కాదు .
    నేను వాళ్ళతో మాట్లాడకపోయేవాన్ని . అహంభావం కాదు , అమాయకంగా అడీగే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనని తెలిసి మౌనంగా ఉండేవాణ్ణి . అయినా వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకొనే అవకాశం , అవసరం మాకు రాకపోయేది . స్థానిక పోలీసుల సహాయంతో కీలక ప్రాంతాలు సర్చ్ చేసి తీవ్రవాదులను కనిపిస్తే హతమార్చడంలోనే మా సమయం గడిచిపోయేది .
    ఒక్కోసారి ఆ గ్రామీణ వాతావరణం  విసుగును కలిగించేది . అమాయక గ్రామీణులు , పేదరికానికి ప్రతీకలైన వారి గుడెసెలు , దుమ్మూధూళి పేరుకుపోయే మట్టి రోడ్లు అవన్నీ ఆహ్లాదరహితంగా కనిపించేవి .నా కఠిన కమాండో శిక్షణ చాలావరకు  ఆ విసుగును పారద్రోలే ప్రయత్నం చేసేది . మా పరిధిలో కాస్త ప్రశాంతత వచ్చేయడంతో మేము కాస్త రిలాక్స్ అయ్యాము .
    ఓ రోజు గుడికి వెళ్ళాను . ఆరోజు నా పుట్టిన రోజు .దేముడిని దర్శించుకున్నాక ఆ గుడి ప్రాంగణంలోని రాతిమెట్టుపై కూర్చున్నాను . పక్షుల కిలకిలా రవాలు , అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు , ఉత్సాహానందాలతో భక్తులు కొట్టే గుడి గంటల ధ్వనులు నాకెంతో ప్రశాంతతను ఇచ్చాయి .
    సమయమెంత గడిచిందో జ్ఞాపకం లేదుగాని అసంకల్పితంగా నాదృష్టి మెట్లు ఎక్కిపైకి వస్తున్న ఆమెపై పడింది . ఆమె అందాన్ని చూసి నాప్రమేయం లేకుండానే నోరు తేర్చుకుంది . విస్మయంతో శ్వాసించడం మరిచాను. ఆమె నా వైపు చూడకుండానే నన్ను దాటి వెళ్లిపోయింది . ఆమె గర్భగుడిలో వెళ్ళేవరకు అలాగే చూస్తుండిపోయాను . నిజానికి నేను చలించింది తన అందానికే కాదు . ఆలాంటి గ్రామంలో తనలాంటి అద్భుత సౌందర్యారాశి ఉండటం . బురద నీళ్ళలో పద్మా న్ని చూస్తే ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో నాకలా అనిపించింది . కాసేపట్లోనే వివేకం తట్టడంతో తేరుకొని క్రిందికి దిగాను . మా విడిదికి వచ్చేలోపు ఆమె గురించి వివరాలు సేకరించాను . నా సేకరణలో అర్థమైందేమిటంటే ఆ గ్రామంలోని ఏకైక ఆస్పత్రికి డాక్టరామే . తన పేరు అర్పిత అని . నాకు ఆసక్తిని కలిగించింది తను అవివాహితాని కాదు ,తనది ప్రైవేట్ ఆస్పత్రి అయిన పేదలకు ఉచితంగా వైద్యం చేస్తుందని .
      “ నెక్స్ట్ ..  ”  అన్న ఆ డాక్టర్ గొంతు విని ఆలోచనల్లో విహరిస్తున్న నేను బాహ్యంలో వచ్చాను . క్షణాల్లో అర్థమైంది నేనే ఆఖరు పేశంటని .. నిజానికి నాకే వ్యాధి లేదు . ఆమెతో పరిచయం పెంచుకోవాలని అక్కడికి వచ్చాను . లోనికి వెళ్ళాక పేశంట్స్ స్టూల్ పై కూర్చున్నాను .
     “ యస్ ...  ” సౌమ్యంగా  అంది ప్రాబ్లం చెప్పండి అన్న భావం వచ్చేట్టూ .  
     “ బుఖార్ హై ..    హిందీలో నెమ్మదిగా అన్నాను .
     పల్స్ చూసి తన దగ్గరున్న టాబ్లెట్లు ఇచ్చి ఎలా వాడాలో చెప్పింది .
     “  ఫిర్ కబ్ ఆనా ..... అడిగాను .
     “ డొన్నో ఇంగ్లీష్ ?   అడిగింది .
    రాదని తలూపాను .
    నీకు తెలుగు రాదు . ఇంగ్లీష్ రాదు . నా హింది నీకర్థం కాదు ఎలా  స్వగతంగా అంది .
  “  ఫిర్ కబ్ ఆనా ..... మళ్ళీ రెట్టించాను .
   “కబ్ అంటే ... ?    అని సైగతో టాబ్లెట్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చూపించింది .
   “ ఆప్ కొ హింది ... .. కావాలని అడిగాను .
   రాదన్నట్టు తల అడ్డంగా ఊపింది .
   ఇక అక్కడ ఉండే అవకాశం లేక వెనక్కి వచ్చేశాను . రెండో రోజు , మూడో రోజు అలాగే వెళ్ళాను . ఒక డాక్టర్ లాగే సంభాషించిందే తప్పా పరిచయం పెంచుకుందామనే ఆసక్తి ఆమె లో ఏమాత్రం కనిపించలేదు . నిజానికి నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానో నాకే స్పష్టత లేదు . ఆమెతో స్నేహం చేసుకోవాలనే ఏదో పంతం నాలో పెరిగినట్టు నాకనిపించింది .
     అలా కంటిన్యూ వెళుతూ ఉంటే ఓసారి వచ్చిరాని హిందీలో నీకే వ్యాధి లేనప్పుడు  ఎందుకొస్తున్నావిక్కడి అడిగింది
    నేను మందహాసం చేస్తూ అన్నాను
   సాయింత్రం పూట గుడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది . నేను రోజు వెళ్తాను .. మీరు వస్తారనే ఆశతో
    ఆమె నా తెలుగును జీర్ణించుకొనేలోపు నేను వెనక్కి వచ్చేశాను . ఆ సాయింత్రం గుడికి వెళ్ళాను . ఆమె కోసం చాల సమయం నిరీక్షించాను . తను రాకపోవడంతో అంతగా బాధ పడలేదు . అపరిచితుడైన నేను పిలువగానే వస్తుందనే నమ్మకం నాకు లేకపోయిన సహజమైన ఆశ ఎదురుచూసేట్టూ చేసింది . అలా రెండు సాయింత్రాలు అర్పిత గురించి ఎదురు చూశాను . తను రాలేదు . మరుసటి రోజు నేనే ఆస్పత్రికు వెళ్ళాను .
     నన్ను చూడగానే ఆమె భృకుటి ముడిపడింది . నా వంతు వచ్చేవరకు దాదాపు అన్నీ చర్యల్లో విసుగును ప్రదర్శించసాగింది . నేను ఎదురుగా కూర్చున్నాక  యస్ ....అంది ఎందుకొచ్చావు అర్థం వచ్చేలా .
     జ్వరం  అన్నాను .
     ఆమె నా పల్స్ చూడకుండానే పది టాబ్లెట్లు ఇచ్చి  ఇది వాడి తగ్గకుంటే సిటీకి వెళ్ళండి అంది ఇక నువ్వేళ్ళచ్చు అనేలా .
      నేను లేచాను మీరు వస్తారేమోనని రోజు ఎదురు చూస్తున్నాను అన్నాను
      నోర్ముయ్ . ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే నీ పై అధికారులకు కంప్లైంట్ ఇస్తాను గెట్ అవుట్ .. తీక్షణంగా చూస్తూ అంది .
    ఒకే మేడమ్ నేను వెళ్తాను . కానీ నేను చెప్పేది వినండి  శాంతంగా అన్నాను .
నువ్వు వెళ్తావా ..లేదా ..
   వెళ్ళను..  
    పోలీసులను పిలుస్తాను ..
   మీరు ఎవరిని పిలిచిన నే చెప్పేది విన్న తర్వాతే వెళ్తాను
    చూడు . ఇక్కడి గ్రామీణుల ఎదురుగా గొడవ వద్దు ..
     అప్పటికే అక్కడున్న గ్రామీణులు మావైపే చూస్తున్నారు . నాకు తెలుగు వస్తుందా అని కొందరు , ఏంచేస్తానా అని మరి కొందరు ఆసక్తిగా చూస్తున్నారు .
   గొడవ చేయడం నాకిష్టమా ? నే చెప్పేది వినండి .. అభ్యర్థనగా అన్నాను .
    తను ఏమనుకుందో     సరే చెప్పు .. అంది .
    నిజానికి మీ అందం కంటే మీ వ్యక్తిత్వం నాకు చాల నచ్చింది . సిటీలో మంచి జాబ్ చేయగలిగే మీరు ఇక్కడి గ్రామంలో ఉచితంగా వైద్యం చేయడం నాకు మీపట్లా గౌరవాన్ని కలిగించింది . మీతో పరిచయం పెంచుకుందాం అనుకున్నాను    సౌమ్యంగా అన్నాను తను నామాటలు పూర్తిగా విన్నాదనే సంతృప్తితో.   
    సరే చెప్పావుగా ..ఇక వెళ్ళు ...
     కోపాన్ని ఆధీనంలో ఉంచుకుంటూ అన్నదని  నాకు అర్థమై వెనక్కి తిరిగాను .
      అర్పిత గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు   విన్నపంగా అన్నాను .
      ప్లీజ్ ..  రెండు చేతులు జోడించి అన్నది .
      నేను వెనక్కి వచ్చేసాను . నాకు తన పట్ల ఎలాంటి కోపం రాలేదు . స్వాభిమానం ఉన్న ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుందని నాకు తెలుసు . అర్పిత అంటే నాకు మరింత గౌరవం పెరిగింది .
      వారం రోజులు గడిచాయి . ఆ వ్యవధిలో అర్పితను క్రమంగా మరిచాను . ఆరోజు మాకో అత్యంత విశ్వసనీయమైన ఇన్ఫర్నేషన్ వచ్చింది . నది పరివాహక ప్రాంతంలో తీవ్రవాదులు సమావేశం కాబోతున్నారని .. మేము  గత కొన్ని రోజులుగా కూంబింగ్ వెళ్ళకపోవడం వలన  తీవ్రవాదులకు అవకాశం లభించిందని అర్థమైపోయింది . మేము మా ప్రణాళిక వేసుకున్నాము . మరుసటి దినం ఆపరేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము .
    ఆ సాయింత్రం గుడికి వెళ్ళాను . వారం రోజుల తర్వాత వెళ్ళిన నాకు అక్కడి వాతావరణం చాల ప్రశాంతతను ఇచ్చింది . దేవుడిని దర్శించుకున్నాక రాతి మెట్టు పై కూర్చొని అక్కడి నుండి కనిపించే దృశ్యాలను చూడసాగాను .
      “ హలో ఆఫీసర్ ... సున్నితమైన ధ్వనికి రివ్వున వెనక్కి చూశాను . ఎదురుగా అర్పిత . విస్మయానందాలతో నోరు తెర్చేశాను .
     “ ఇక్కడ దోమలు ఎక్కువండి ..జాగ్రత్తా .. చిన్నగా నవ్వుతూ నా సమీపంగా కూర్చుంది .
     నేనెలా స్పందించాలో కొన్ని క్షణాలు అర్థం కాలేదు
     మాట్లాడరా ?.... సారి . ఆ రోజు కోపంలో ఏదేదో అన్నాను . .. మీరు వెళ్ళి పోయాక  నాకు బాధ అనిపించింది . క్షమాపణ అడగడానికి రోజు ఇక్కడికి వస్తున్నాను . మీరే రావడం లేదు   అనునయంగా అంది .
       అరెరె మీరు సారి చెప్పడమేమిటీ ? .. నిజానికి అది నేను చెప్పాలి ..  నొచ్చుకుంటూ అన్నాను .
        ఆ విషయం ఇక వదిలేయండి . ..ఇక నుండి మనం స్నేహితులం ..సరేనా    చిర్నవ్వుతూ అంది .
       ఆమె మాటలతో నా మనసు తేలికయింది . ఆ తర్వాత అరగంటసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము . దాదాపు అన్నీ అంశాల్లో ఆమెకున్న పరిజ్ఞానమేమిటో నాకు అర్థమై తన పట్ల మరింత అభిమానం పెరిగింది . ఆమె టైమ్ చూసుకుంటూ నిలబడింది .
        మీతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు . చాలా రోజులకు ఒక మంచి స్నేహితునితో కలిసిన అనుభూతి కలిగింది మందహాసం చేస్తూ అంది .నిజానికి ఆ మాటలు నేను చెప్పాలనుకున్నాను కానీ తనే నాకంటే ముందు చెప్పేసింది . నేను చిర్నవ్వుతూ లేచి నిలబడ్డాను .
       పార్టీ ఎప్పుడిస్తున్నారు ?    చిన్నగా నవ్వుతూ అంది .
       “ ఇస్తాను ..కానీ ఏ సందర్భానికి ? విస్మయం దాస్తు అడిగాను .
        మనమిద్దరం మంచి స్నేహితులమయ్యాము . ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది ?   నవ్వుతూ అంది . .
   ఓ ఆదా .. మీకు ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడే ..
    మీరెప్పుడైనా ఇవ్వండి . నేనోస్తాను . కానీ రేపు లంచ్ నాతో పాటూ చేయాలి అభ్యర్థనగా అంది .
    రేపా ? ..రేపు వద్దండి కాస్త కంగారుగా అన్నాను మరుసటి దినం నాకు ఆపరేషన్ కు వెళ్లాల్సి ఉండటంతో .
    ఎందుకండి అలా కంగారూ పడ్తారు ? పార్టీ నేనిస్తున్నాను . మీకిమ్మనడం లేదు  చనువుగా అంది .
   అది కాదు . రేపు సర్చ్ కు వెళ్లాల్సి ఉంది .. అందుకు ... మరోసారి మీ ఆహ్వానాన్ని కాదనను ప్లీజ్   అన్నాను             “ సరే లెండి . జాబ్ ముఖ్యం కదా ... ఇక మీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు కాస్త నిరుత్సాహంగా అంది .
      నా తీరిక సమయంలో నేనే మీ ఆస్పత్రికు వస్తాను
     ఇద్దరం మెట్లు దిగసాగాము .
     ఆ రోజు తీవ్రవాదులందరిని ముట్టు పెట్టాలనే కృతనిశ్చయంతో ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రాంతానికి వెళ్లాము . అక్కడే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ అనువణువు గాలించాము . ఫలితం శూన్యం . మా అందరి ముఖాల్లో అసంతృప్తి ప్రతిఫలించింది . చేయగలిగిందేమీలేక వెనక్కి వచ్చేశాము .
    నా విశ్రాంతి సమయాల్లో అర్పితను కలుస్తూనే ఉన్నాను . క్రమంగా మా ఇద్దరిలో చనువు పెరిగింది . దాంతోపాటే ప్రేమ పెరిగింది . తనను చూడకుండా ఉండలేని స్థితికు వచ్చాను . ఎన్నోసార్లు తను లంచ్ కు ఆహ్వానించేది . కానీ ప్రతిసారి సర్చ్ అడ్డం వచ్చేది . తనను అనునయించడానికి తలప్రాణం తోకకు వచ్చేది . రోజులు గడుస్తున్నాయి . మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉగ్రవాదులు సమావేశమవుతున్నారని . ఆ సాయింత్రం అర్పితను కలిశాను . నా మనసంతా మరుసటి దినం జరగబోయే ఆపరేషన్ పైనే ఉండటంతో కాస్త అన్యమనస్కంగా ఉన్నాను . అది తను గమనించి ప్రశ్నించింది . తన ఆహ్లాదకర మనసును పాడుచేయడం ఇష్టంలేక  ఇల్లు జ్ఞాపకం వస్తుందని అబద్దం చెప్పాను .
      ఏ రోజు నాకెంత ఆనందంగా ఉందో చెప్పనా ? మా అమ్మానాన్న మన వివాహానికి ఒప్పుకున్నారు ... రేపు మనిద్దరం సిటికు వెడుదాం .. నా చేయి పట్టుకొని భుజం పైన వేసుకుంటూ విప్పారిన వదనంతో అంది .               కంగారుపడ్డాను . ఈ సారి తీవ్రవాదులు ఖచ్చితంగా తారసపడుతారని ఎందుకో నా మనసు చెబుతుంది . కొన్ని క్షణాలు ఆలోచించాను . ఈ విషయం తనకి చెబితే నిరాశ పడుతుంది . అప్పటికే  ఎన్నోసార్లు ఆమె ఆహ్వానించడం నేను నిరాకరించడం జరిగింది . వస్తానని చెప్పి తనకు సంతృప్తి కలిగించి తర్వాత ఎలాగైన మానేజ్ చేయాలి అనుకున్నాను .
  “ సరే ..తప్పకుండ వెళ్దాం మందహాసం నటిస్తూ అన్నాను .
   నిజంగా.... అపనమ్మకంగా అంది . ఆ క్షణం తన కళ్ళలో వచ్చిన మెరుపును గమనించాను .
    నిజంగానే వెళ్దాం ...
     “ రేపే సమయం వెళ్దాం   ఉత్సాహంగా అంది .
     ఆ క్షణం తనపై ఎందుకో జాలి కలిగింది . కానీ ఏమిచేయలేను డ్యూటీ ముఖ్యం కదా !
     ఏమాలోచిస్తున్నారు ?  నా మౌనం చూసి కాస్త కంగారుగా అడిగింది . నా నిర్ణయంలో ఏదైనా మార్పు వచ్చిందానే భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది .
     అర్పిత మనమిద్దరం జంటగా వేడితే ఈ గ్రామీణుల దృష్టిలో బాగుండదేమో ... నువ్వు ముందు వెళ్లిపో .. నాకు అడ్రస్ ఇచ్చేయ్ . నేను తర్వాత వచ్చేస్తాను నచ్చచెబుతున్నట్టు అన్నాను .
     ఆమె కాసేపు ఆలోచించి ఒక నంబర్ రాసిచ్చింది .  మీరు సిటికు రాగానే ఈ నంబర్ కు కాల్ చేయండి . నేను రిసీవ్ చేసుకుంటాను
    ఆ తర్వాత ఇద్దరం కాసేపు అక్కడే భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాము .
     రెండో రోజు అన్నీ విధాలా సంసిధ్హమై కూంబింగ్ కు వెళ్లాము . మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరక్టే .. దూరం నుండే గమనించాము ఓ చోట తీవ్రవాదుల ప్లీనరీ జరుగుతూ ఉంది  .
     నేను లీడర్ కావడంతో అందరికీ ప్రణాళిక వివరించి అందరికి వారి వారి స్థానాల్లో పంపించాను . అందరూ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రాంతానికి కాస్త దూరంలో మూడు దిక్కుల్లో ఎత్తైన ప్రాంతంలో పొజిషన్ తీసుకోవాలి . క్రాస్ ఫైర్ జరగకుండా ఓ వైపు కమాండోలు ఎవరు ఉండకూడదు . మూడు వైపులా నుండి ఫైరింగ్ వస్తుండటం తో తీవ్రవాదులు ప్రాణ భయంతో ఆ వైపే పరుగెత్తుతారు . ఆ దారిలో కాచుకున్న మిగిలిన కమాండోలు పరుగెత్తుకొచ్చే తీవ్రవాదులను సునాయాసంగా హతమార్చవచ్చు . అయితే అక్కడ మాకో చిన్న సమస్య వచ్చింది . హిట్ కమాండర్ అయిన నేను మొదట ఫైరింగ్ చేస్తూ శత్రువులను కంగారు పెట్టాలి . వాళ్ళ మధ్యలో దూసుకు పోవాలి . అది చాల రిస్క్ . అయిన ఎప్పుడు ఆ పని నేనే చేస్తాను . అయితే ఆ పని నేనెప్పుడు చేస్తాను అంటే మా స్నైపర్ శత్రువుల సెంట్రిను హతమార్చినపుడు . మాకు వచ్చిన సమస్య ఏమిటంటే మాకో స్నైపర్ తక్కువయ్యాడు . ఆపోస్ట్ పై ఉండేవారి గురి ఏమాత్రం తప్పకూడదు . తప్పితే మాకే ఎక్కువగా నష్టం జరుగుతుంది . అందుకే నేనే స్నైపర్ గా ఉండటానికి సిద్ధపడ్డాను . ఎందుకంటే నా గురి ఏమాత్రం తప్పదు .
      అందరం పొజిషన్ తీసుకున్నాము . నేను ఎత్తైన ప్రదేశం నుండి లాంగ్ రేంజ్ ఆటో వేపన్ తో వాళ్ళ సెంట్రి పై గురి చూశాను . వాడు నాలుదిక్కులు గమనిస్తూ పహరా కాస్తున్నాడు . నేను వాడి కంటే పై ఎత్తులో పూర్తి కామొ ఫ్లెజ్లో ఉన్నాను . వెపన్ కాక్ చేశాను .
     ఫైర్ చేయడానికి ముందు ఒకసారి మనసులో దేవుణ్ణి ప్రార్థించాను .   నా చేతిలో ఒకరి ప్రాణం పోబోతుంది . విధి నిర్వహిస్తున్ననే తప్ప వ్యక్తిగత కక్ష కాదు . నన్ను క్షమించు ... నా ప్రార్థన ముగియగానే ఫైర్ చేశాను .  వాడు ఒక్కసారిగా అరుస్తూ క్రిందపడిపోయాడు . అంతే ..అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా బుల్లెట్ల ధ్వనులతో అట్టుడికి పోయింది . పక్షులు ప్రాణభయంతో అరుస్తూ మూకుమ్ముడిగా చెట్లపై నుండి ఆకాశంలోకి లేవసాగాయి . అరగంట పాటు అదే పరిస్థితి కొనసాగింది . నేను మరో స్నిపర్ తివారీ మా పొజిషన్లను మార్చుకున్నాము .
      ఈ సారి మా టార్గెట్ తప్పించుకొని మాదారిలో వచ్చే తీవ్రవాదులను మేము హతమార్చాలి . నాకు కనిపిస్తున్న ప్రదేశం వరకు అప్రమత్తంగా చూస్తూ ఉన్నాను . ఎండుటాకులు పుట్టిస్తున్న ధ్వని వలన అర్థమయింది ఎవరో పరుగెత్తు కొస్తున్నారని . క్రమంగా ఆ ధ్వని దగ్గరైయింది .
      నేను తివారీ వైపు ప్రశ్నార్థకంగా చూశాను . అతను ఉన్నచోట నుండి వాళ్ళు కనిపిస్తారు . ఇద్దరు ఉన్నట్టు సైగ చేశాడు . నేను ఫైర్ చేయమని సైగ చేశాను . తివారీ వాళ్ళను మరింత దగ్గరిగా రానిచ్చి ఒక్కసారిగా ఫైర్ చేశాడు . గ్రీన్ ఆలీవ్ డ్రస్ లో ఉన్న ఇద్దరు అక్కడే కూలినట్లు నాకు ఆస్పస్టంగా కనిపించింది . మేము ఇంకెవరైనా అలాగే తప్పించుకొని వస్తారేమోనని చూస్తూ కూర్చున్నాము .
     కొన్ని నిమిషాలు గడిచాక ఆ శవాల దగ్గరికి నడిచాను . తివారీ కూడా వచ్చాడు . ఒక శవమైతే పూర్తిగా గాయాలతో గుర్తు పట్టని విధంగా మారి ఉంది . బోర్లపడి ఉన్న మరో శవాన్ని కాలితో నా వైపుకు తిప్పాను .  
     ఆకాశంలో పక్షులు సురక్షిత స్థానాన్ని వెదుకుతూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి . గాలి వీస్తూనే ఉంది . పొగ , వాసనలను ఇంకా గాలిలో తేలుతూనే ఉన్నాయి . హృదయం తప్పా మరే అవయవం నా ఆధీనంలో లేనట్టు చలనరహీతంగా నిలబడి దిగ్భ్రాంతిగా ఆ శవాన్నే చూస్తూ ఉన్నాను .
     అది డాక్టర్ అర్పిత శవం .. నా ప్రేయసి శవం ..
      నా కమాండో శిక్షణ వల్లనేమో నేనింకా స్పృహలోనే ఉన్నాను . క్రమంగా నా కళ్ళలో దిగ్భ్రాంతి పోయి నిర్లిప్తత రాసాగింది . మెదడు పనిచేయడం ప్రారంభించింది .
    ఒక్కో సంఘటన జ్ఞాపకం రాసాగింది . ఆమె ఈ కుగ్రామంలో ఉంటూ ఎందుకు ఉచిత వైద్యం చేసిందో , ఏ ప్రణాళిక ప్రకారం నాతో ప్రేమ నటించి కూంబింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొనేదో , నేటి ఇన్ఫర్మేషన్ కూడా ఎంత తెలివిగా తెలుసుకోవాలని ప్రయత్నించిందో సునాయాసంగా నాకు అర్థమైపోయింది .
    నేను అనివార్యంగా చెప్పిన అబద్దం వలన తన వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమావేశపరిచిందని ఊహించడం నాకే పెద్ద కష్టం కాలేదు . నాలో ఆలోచనలు సుడిగుండాల్లా తిరగసాగాయి . నా ఆటో వెపన్ బ్యారల్ ను అర్పిత వదనానికి గురిపెట్టాను . ట్రిగర్ ప్రెస్ చేశాను . ఆ ధ్వనికి మరోసారి ఆ ప్రాంతం అట్టుడికిపోయింది . క్షణాల్లో మ్యాగ్జిన్ ఖాళీ అయింది . ఆమె వదనం గుర్తు పట్టలేని విధంగా ఛిన్నాభిన్నం అయిపోయింది .
    నా హృదయంతో ఆడుకున్న అమ్మాయి అని కాదు ఆమెపై అలా  కాల్పులు జరిపింది , ఆమె అర్పిత అని ప్రపంచానికి తెలియడం ఎందుకో నాకిష్టం లేదు .
   తివారీ నన్ను వారిస్తూ ఏదేదో చెబుతున్నాడు . నేనదేమీ గమనించడం లేదు . స్పృహ వచ్చాక తొలిసారిగా రాలుతున్న  బాష్పాలనే చూస్తూ ఉన్నాను .











  
  


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

7 Comments

avatar

modati kadha ayina chaalaa baagaa rasaru andi abhinandanalu

Reply Delete
avatar

మంజు గారు ... ఓపికగా చదివి అభినందనపూర్వకంగా వ్యాఖ్యానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి

Reply Delete
avatar

ఈ కధ నిజమేనా?????

Reply Delete
avatar

ఈ కథ చదివిన నా సాహితి మిత్రురాలైన ఒక కవయిత్రి ఫోన్ లో పరిహాసంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు అప్పుడు నాకున్న బిజీ వలన ఇక్కడే రిప్లై ఇస్తానన్నాను ... తను ఇది చూస్తారని నమ్మకం ...

తొలి కథ కావడంతో బహుశ వాక్యనిర్మాణం కుదరలేదేమో ... నాకు కమాండో కావాలని ఎందుకో చాల కోరిక ఉండేది అప్పటి హాలివుడ్ ప్రభావమేమో ... నన్ను నేను కమాండోలా ఊహిస్తూ రాసిన కథ ఇది ... కేవలం కల్పితం .. ఒక డాక్టర్ పాత్ర కు అర్పిత అని పేరు పెట్టాను .. అర్పిత శిశు నిండి టెన్త్ వరకు నా సహాధ్యాయిని ..నాలుగవ తరగతి వరకు కూడా నాకు తెలుగు సరిగా రాకుంటే క్లాస్ లీడర్ అయిన తన చెంప దెబ్బ తిన్నాక పంతం పెరిగి ఆ భాష పై కాస్త పట్టు సాధించాను ..పరోక్షంగా నాకు గురువు లాంటి అమ్మాయి పై అభిమానంతో నా తొలి కథలో తన పేరు ప్రస్తావించాను ..ఆ తర్వాత చాల కథల్లో ఆ పేరును ఉపయోగించాను . కాకపోతే నేను రాసినట్టు ..కథలో రాసిన విధంగా నేను కమాండో అయ్యాను . తను డాక్టర్ అయింది . ముంబాయి లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది .. రాసిన విధంగా జరగడం కేవలం యాదృచ్చికమే .... మీ అభినందన మాలను నా సాహితీ ఆశ్రమంలో అలంకరించుకుంటాను .... మీ అన్నీ సందేహాలు నివృత్తి ఐనాయనుకుంటాను .. ధన్యవాదాలతో ...

Reply Delete
avatar

Oh...what an co-incidence! May your friendship be forever.

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.