మన
మధ్య ఆగాధం ఏర్పడవచ్చు ..నిజమే
అందరూ
గుర్తించేలా
నువ్వు
ప్రవర్తించడం భావ్యమా ?
వెళ్లిపోవడానికి
దారికై
ఒక్కో
ఇటుక తీసేస్తున్నావు
ప్రహరీ
కూల్చి ఇతరులకు
దారి
చూపడం న్యాయమా ?
వెళ్లిపోవాలనే
నీ నిర్ణయాన్ని
తొందరపాటని
నేననలేను
నాకు
తెలుసు నువ్వొక
సరదాగా
సాగిపోయే సమీరానివి
నిన్ను
స్థిరంగా ఆపడం నాతరం కాదని ....
వెళ్లిపో
.. వద్దనను ..కానీ
అర్ధాంతరంగా
నానుండి నిష్క్రమించకూ ...
తొలి
సంధ్యను నిశి వదిలినట్లు నెమ్మదిగా వదిలిపోలేవా ?
నువ్వు మనస్ఫూర్తిగా నాతో ఉండకు
కలిసే ఉన్నామని నటించలేవా... ?.
నా పరిసరాల్లో రావడం నీకిష్టం లేదని నాకు తెలుసు
కనీసం నా పరిధిలో నీ ఉనికి ఉన్నట్టు ప్రవర్తించలేవా ..?