గర్భంలో ఒక చర్య మొదలవగానే
నువ్వే ఉండాలని మనసులో ఉన్నా
నిజంగా నువ్వే ఉన్నావేమో అని
భీతి కూడా చెందుతుంది
ఎవరో ఏదో అంటారని భ్రమపడుతూ
నీకో ఆకృతి రాక ముందే
మనసును చంపుకొని
శల్య పరీక్షలు చేయిస్తుంది
దైవ నిర్ణయాన్ని కాదనుకొని
మెట్టినింటి వారి మెప్పు కోసం
నిన్ను విసర్జించాలని
అనివార్యంగా ప్రయత్నిస్తుంది
ఆ తొలి పోరాటాన్ని జయించి
నువ్వు లోకానికొచ్చాకా
ఆర్తిగా హృదయానికి హత్తుకున్న
నేరం చేసిన దానిలా
ఎవరి కళ్ళల్లో చూడలేక పోతుంది
నీ ఆడపుట్టుకకు కారణం
తను కాకపోయిన ,
అందరికది తెలిసిన
నేరం తనపై వేసుకుంటుంది
నిన్ను స్వేచ్చగా పెంచాలని తనకున్నా
అనివార్యంగా ఆంక్షలు పెడుతుంది
నువ్వొక ఇంటిదానివయ్యే వరకే కాదు
నువ్వొక జన్మ ఇచ్చేవరకు
నీకోసమే పరితపిస్తుంది
తనకు అమ్మాయి పుట్టాలని
ఎంతగానో కోరుకున్నా ఆ తల్లి
నీ సమయం వచ్చేసరికి
మనసును మార్చుకుంటుంది
నీకు అబ్బాయే పుట్టాలని
ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది
తను పడిన బాధలు
నువ్వు పడకూడదనుకుంటుంది
ఎందుకంటే తనది ఒక తల్లి మనసు .....