Followers

Tuesday, October 22, 2013

thumbnail

చివరి కోరిక....




ఇంకేం అనుకోవాలి ఇప్పుడు ...
కన్నార్పకుండా నన్ను చూసినపుడే అర్థమైంది ..
నువ్వు దూరం అవుతున్నావని ...

దూరమయింది నువ్వొక్కదానివే కాదు
నా సర్వాన్ని తీసుకెళ్లిపోయావు
ఆహ్లాదంగా స్పందించే హృదయాన్ని
పెదాలు వీడని మందహాసాన్ని

ప్రకృతిని ప్రేమించే తన్మయత్వాన్ని
మల్లెల్ని , వెన్నెల్ని
పక్షుల కిలకిలా రవాల్ని
గోధూళి వేళ కనిపించే సూర్య కిరణాల్ని
ప్రతి దానిలో నిన్ను వెదుక్కోనే నా అమాయకత్వాన్ని ...

అన్నింటిలో విరక్తిని కలిగిస్తూ ....  ఎన్నెన్ని తీసుకెళ్లిపోయావు ..
కొన్ని వదిలిన .. వాటిని చూస్తే నీ వియోగం
గుర్తుకొచ్చే ఒక భయాన్ని మాత్రం వదిలిపోయావు  

ఒకప్పుడు వెన్నెల మామూలుగా అనిపించేది
నువ్వు నా జీవితంలో వచ్చాక ఎంతో ఆహ్లాదంగా అనిపించేది
నువ్వు వెళ్లిపోయాక ఇప్పుడు వెన్నెల అంటేనే భయాన్ని కలిగిస్తూ ఉంది
అలా వెన్నెల దూరమైయింది

ఒకప్పుడు మల్లెలు మామూలుగా పుష్పాల్లా అనిపించేవి
నువ్వు నా జీవితంలో వచ్చాక ఎంతో ఆహ్లాదంగా అనిపించేవి
నువ్వు వెళ్లిపోయాక ఇప్పుడు మల్లెల్ని చూడాలంటే భయం అనిపిస్తుంది  
అలా మల్లెలు దూరమయ్యాయి

దూరమైనవి చెప్పుకుంటే వెళితే చాలా దూరం వెళ్లిపోతాను
అయిన ఎంత దూరం వెళ్ళిన 
నే వెళ్ళే  దూరం నువ్వు వెళ్లిపోయినంత దూరం ఉండదు లే ...  

నువ్వు ఎన్నోసార్లు చెప్పావు .. దేవుడు నీ ప్రతి కోరిక తీర్చాడని
అర్థం చేసుకోలేని పిచ్చిదానివి .. వాడు సామాన్యుడు కాడు
అన్నీ నీకిచ్చి నువ్వు మురుస్తున్న సమయంలో నిన్ను లాక్కున్నాడు

అబద్దం అనిపిస్తే చివరి కోరికగా ఇలా  కోరు ...
దేవుడా నేనిక్కడ ఒంటరిగా ఉండలేను 
నా కోసం ఇంకా ఒంటరిగా ఉన్న అతన్ని నాదగ్గరికి చేర్చు ...  





Saturday, October 19, 2013

thumbnail

|| siri మల్లెలు ....||




నువ్విలా ఉంటావు ...

నిశీది వలవలు ఒక్కొట్టిగా జారవేస్తుంటే 
అస్పష్టంగా బహిర్గతమయ్యే తొలి సంధ్యలా ....
తొలి సంధ్యలో వినిపించే పక్షుల 
కిలకిలా రవాల శ్రావ్యతలా ....
గోధూళి వేళ అమాయకంగా గంతులు వేస్తూ 
తల్లిని అనుసరించే లేగ దూడలా .....
గ్రీష్మం తర్వాత కురిసి ఆహ్లాదాన్ని 
ఇచ్చే మొదటి వర్షపు చినుకులా ....
వర్షం వెలిసాక నీటి బిందువుపై పడి
విశ్లేషం చెందే కిరణంలా ....
వర్షం కురుస్తున్నప్పుడు కూడ
అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే నులి ఎండలా .....
తొలి సంగమానికి సంసిద్ధమయ్యే
నవ వధువు మస్తిష్కంలా ...

అధరాల తొలి కలయికలో
వెన్నులోంచి వచ్చే జలధరింఫులా ...
పాల్ఘున మాసపు చలిలో చెలికాడి
వడి నిచ్చే నులివెచ్చని అనుభూతిలా ...
ప్రసవ వేదన మరిచి తొలి సంతానాన్ని
చూసే మాతృ హృదయంలా ....
తొలిసారిగా పాఠశాలకు వెళ్తూ వెనక్కి తిరిగి
తల్లిని చూసే పసివాడి బేలా చూపులా ....
గోరింటా పండిన చేతులను
చూసుకొని మురిసే పసిపాపలా ...
వసంతాల అనంతరం మాతృ భూమిపై అడుగిడినపుడు
కలిగే అనిర్వచనీయంగా కలిగే ఆనందం లా .......





****  నిజానికి ఒకప్పుడు ఇది ఎందుకు రాసానో చెప్పలేను .. కానీ మిమ్మల్ని చూడక ముందు .. మీతో మాట్లాడక ముందు ఇది రాసాను . మీతో కలసి ఇంటికి వచ్చాక మళ్ళీ దీన్ని చూశాను .. నేను ఎలా రాసానో మీరు అలాగే ఉన్నారు ... మీ ఫోటో చూసాక ఎందుకో దీన్ని మళ్ళీ పోస్ట్ చేయాలనిపించింది ... మీ అందాన్ని నిర్వచించడమే తప్ప మరో దురుద్దేశం తో మాత్రం కాదు సుమా ... క్షమాపణలతో .... *****

Wednesday, October 16, 2013

thumbnail

!! నువ్వే అయినప్పుడు .... !!





నువ్వొక మానలేని గాయం అని ఎలా అనుకోనూ
దాన్ని మాన్పించే లేపనం నువ్వే అయినప్పుడు .... 

నువ్వొక విషాదం అని ఎలా అనుకోనూ
ఉదాసీనతలో వచ్చే ఆహ్లాదం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక స్వప్నం అని ఎలా అనుకోనూ
బాహ్యంలో చేరదీసేది నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శిశిరం అని ఎలా అనుకోనూ
చిగురునిచ్చే వసంతం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక సమస్య అని ఎలా అనుకోనూ
అన్నిటికి పరిష్కారం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక నిశివి అని ఎలా అనుకోనూ
శశివై వెన్నెల్ని కురిపించేది నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శాపం అని ఎలా అనుకోనూ
విధాత ఇచ్చిన వరం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శత్రువు అని ఎలా అనుకోనూ
నా దీర్ఘాయుస్సు గురించి ప్రార్థించేది నువ్వే అయినప్పుడు ....



thumbnail

!! రా నేస్తమా ... !!




రా నేస్తమా

ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దామా ...

మళ్ళీ అపరిచితుల్లాగా కలసి

నీలోని ఆహాన్ని

నాలోని స్వాభిమానాన్ని  కలిపి

ఈసారి ముందుగానే

పునాదుల్లో పూడ్చి

కొత్తగా ఒక స్నేహ సౌధాన్ని నిర్మిద్దాం

నువ్వలా , నేనిలా అనే అనడానికి

నీలో  అహం ఉండదు

నిర్లక్ష్యం చేసే నిన్నెందుకు నిలపాలనే

స్వాభిమానం నాలో ఉండదు

నీలో అసూయ
  
నాలో ఈర్ష్య ఉండదు

నీలో అహంకారం

నాలో అభిజాత్యం ఉండదు

వెదుక్కోవడానికి నీ భావాల్లో నేను

నా భావాల్లో నువ్వు ఉండవు

ప్రశ్నించాలని నీకుండదు

సమాధానం ఇవ్వాలని నాకుండదు

నువ్వు ఆహ్లాదంగా రాస్తావు

నేను ఆసక్తిగా చదువుతాను

నీ మనసుపై ముసుగు ఉండదు

నా మనసు పై పొర ఉండదు

అప్పుడు ....

నీకేదైనా బాధ కలిగినపుడు

నీ ఆప్తుల్లో ఒకరిగా నేను కనిపిస్తాను

నాకేదైనా సమస్య వచ్చినప్పుడు

ముందు నువ్వే జ్ఞాపకం వస్తావు

నీనుండి నేనేమీ ఆశించను

నానుండి నీకే సమస్య ఉండదు

నిష్కల్మషంగా  ఉండటానికి

మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దామా

కొత్తగా ఒక స్నేహ సౌధాన్ని నిర్మిద్దామా ...



**  THANK YOU AKRUTI .... ** 






thumbnail

!! నా మనస్తత్వం ... !!

*** ఇది నా 100 వ కవిత ... నాకు స్పూర్తినిస్తూ వస్తున్న  నలుగురు మిత్రులకు ఇది అంకితం .... *** 




నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితం శిశిరమైపోదు
ఏ ఒక్క ఆకు అసంతృప్తిగా రాలవద్దనే
ఆత్మీయతత్వం నాది 

నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా స్నేహ సంపదేమీ తరిగిపోదు
ఏ ఒక్కరినీ దూరం చేసుకోవద్దనే
పిసినారితత్వం నాది

నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితం చీకటిమయమైపోదు
ఏ ఒక్క నక్షత్రం అర్దాంతరంగా రాలకూడదనే
ఆర్దత్వం నాది

నువ్వొక్కదానివి వెళ్లిపోతే
నా జీవితంలో ప్రళయమేమి రాదు
అయినా నిన్నుఅభ్యర్థించి ఆపాలనే
స్నేహతత్వం నాది

నువ్వొక్కదానివి వెళ్లిపోతే
అందరు పోతారనే భయమేమి కాదు
ఎవరెళ్లి పోయినా నువ్వు మిగిలితే చాలనుకొనే
అమాయకత్వం నాది




Tuesday, October 15, 2013

thumbnail

!! SIRF TUM ... !!





నిజానికి చిన్న విషయమే ఉంటుంది 
నీ విన్నపాన్ని కాదని అంటాను .. అంతే 
నువ్వు అసహనంతో ఏదేదో అంటూనే ఉంటావు 
వాదించి నీ ఆహాన్ని గాయపరచడం ఇష్టంలేక 
నేను ఓడినట్లు మౌనంగా ఉండిపోతాను

నా మౌనాన్ని ఎలా అర్థం చేసుకుంటావోగాని నువ్వెళ్ళిపోతావు
నువ్వు లేకుండా ఉండలేనని నాకు తెలిసినా .. అహం అడ్డొచ్చి ఆపను ...
నువ్వు వెళ్తూ చూసిన నీ చూపులకు అర్థం చేసుకోవడానికి
ఆరోజంత ప్రయత్నిస్తూనే ఉంటాను ..కానీ అర్థం చేసుకోలేక పోతాను

పసిపిల్లాడిని చూసినట్లు చూసే నీ చూపులకు
ఏరోజు అర్థం చేసుకున్నానని .. ఆ రోజు అర్థం చేసుకోవడానికి ....
ఎందుకంటే ఇన్నెళ్లలో నువ్వెప్పుడు నాకు అర్థం కాలేదు .. బహుశ కావు కూడా ...

నువ్వు లేకుండా రాత్రి ఎలాగో గడిచిపోతుంది … రోజులాగే ఉదయం లేస్తాను
సూర్యుడి కిరణాలు నన్ను గుచ్చి తట్టి లేపకపోయిన
ఏవో గుచ్చుకుంటున్న అనుభూతి ...
కొన్ని క్షణాల్లోనే అర్థమౌతుంది అదేమిటో
తడి ఆరని నీ కురులతో నా వదనాన్ని స్పృశిస్తూ
నా నుదుటిని ఆర్తిగా చుంబిస్తూ నన్ను లేపేదానివి
ఆ ఉహే సగం నిర్వీర్యుణ్ణి చేసేస్తుంది ..
మిగిలిన సగం నువ్వు లేవనే విషయం అర్థమై ...
అనివార్యంగా లేచి సిద్ధమైపోతాను

ఎన్ని వ్యాపకాలున్నా పక్కకు పెట్టీసి పదే పదే
ఫోన్ చూసుకుంటాను .. నీ సందేశమేదైనా వచ్చిందేమోనని
ఏ ధ్వని విన్నా ఆత్రంగా లిఫ్ట్ చేయబోయి .. నీది కాకపోవడంతో
నిరాశ పడి ఆ ప్రయత్నాన్నే విరమించుకుంటాను
ఆ సాయింత్రం వరకు అదే ప్రక్రియ ...
చేసిన పనికి శరీరమేమోగాని మనసు మాత్రం అలిసిపోయి ఉంటుంది
నిజం చెప్పాలంటే నీ నుండి ఎలాంటి సందేశం
రానందుకే అది అలసిపోయింది ..

నువ్వు లేని ఇంటికెళ్ళి ఏంచేయను ?
ఆ ఉహే మనసును భారం చేస్తుంది ... తిరిగి వస్తుంటే
బైక్ ను నేను నడుపుతున్నానో ,, అది నన్ను నడుపుతుందో
తెలియదు గాని దారి తెలిసినట్టు ఇంటి వైపు తీసుకెళ్తూ ఉంటుంది
ద్రుష్టే తప్ప మనసు దారిపై ఉండదు
అది నిన్ను వెదుక్కుంటూ ఎప్పుడో వెళ్ళి ఉంటుంది ..
నా ప్రమేయం లేకుండానే ఇక అది నీ గురించి వెళ్ళిందంటే
నాకర్థమైపోతుంది ... నా మనసు నిన్నెంతగా కోరుకుంటుందో ...

తప్పంతా నాదేనని కూడలిలో నిలబడి అరిచి చెప్పాలంత
అనురాగం ఒక్కసారిగా వచ్చేస్తుంది ...
అహం ఏదో చెప్పబోతుంది .. నేను పట్టించుకొను
ఆహాన్ని పక్కకు పడేసి .. నీ నంబర్ కలుపుతాను
నీ ఫోన్ మూగపోయి ఉండగానే ..ఒక్కసారిగా ఉక్రోషం
వచ్చేస్తుంది ..

నువ్వంటే తనకు నిర్లక్ష్యం అని నే చెప్పలేదాని .. అహం వెక్కిరిస్తుంది ...
నువ్వు లేకుండా నేను ఉండలేనా .. ఉండి చూపిస్తాను
ఇంటికి వేగంగా వస్తు రోషంగా అనుకుంటాను

అన్యమనస్కంగా ..ఇంట్లోకి అడుగు పెట్టబోయి
తలుపుకు అడ్డంగా నిలబడి మందహాసిస్తూ
లోనికి వెళ్లకుండా ఆపుతున్న
నిన్ను చూసి అక్కడే నిలబడిపోతాను
నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలో తడి...
నువ్వెప్పటికి నాకర్థం కావు ...ఆర్ద్రంగా అంటాను

తను గద్గదికంగా అంటుంది ..
అర్థమైతే ఇక నాపై ఆసక్తి ఉండదుగా .. ఆసక్తి లేకుంటే నీ స్వరం లో ఆర్ద్రత రాదుగా..




thumbnail

!! నేస్తమా .. చూసుకో ..... !!




నా గాయాలను 
ఎందుకు లెక్కిస్తావు 
నీ చేతిలో రాళ్ళెన్ని 
మిగిలాయో చూసుకో ...

నాలోని నిశ్చలనాన్ని
ఎందుకు పరీక్షిస్తావు
నీలోని జ్వలనాన్ని
ఆరకుండా చూసుకో ....

చిన్న శిక్ష విధించే
ఎందుకింత తృప్తి పడ్తావు
ప్రేమంటే అందరూ భయపడేలా
ఉంటే .. శిక్షేదైన చూసుకో ....

నా ఓర్పును
ఎంతవరకని పరీక్షిస్తావు
జాలితో నీ తీర్పు
మారకుండా చూసుకో .....

నాకింకెన్ని
పరీక్షలు పెడతావు
నా విజయాలను లెక్కిస్తూ నీ జీవితాన్ని
ముగియకుండా చూసుకో .....

Thursday, October 3, 2013

thumbnail

!! కాగితం పూలు ... .... రూపమే తప్ప సువాసన లేనివి ... !!




నేస్తమా ... నిన్ను కలవడానికి కనీసం పుష్పాలను కూడ 
తీసుకురాకుండా వచ్చానని నిందించకూ ...... 
వాటిని తీసుకురావాలనే పూలవనంలో వెళ్ళాను 

సంపెంగ పువ్వును కోస్తుంటే అది ఆర్ద్రంగా అంది
నీ ప్రేయసి నాసికలా ఉంటాను ..
నన్ను తెంపాలంటే నీకు మనసేలా వస్తుంది

కలవ మొగ్గను కోస్తుంటే అది ఆర్ద్రంగా అంది
నీ ప్రేయసి నయనాల్లా ఉంటాను ..
నన్ను తెంపాలంటే నీకు మనసేలా వస్తుంది

మందారాన్ని కోస్తుంటే అది ఆర్ద్రంగా అంది
నీ ప్రేయసి ఆధారాల్లా నాజూగ్గా ఉంటాను ..
నన్ను తెంపాలంటే నీకు మనసేలా వస్తుంది

మల్లె పువ్వును కోస్తుంటే అది ఆర్ద్రంగా అంది
నీ ప్రేయసి శ్వాసలోని పరిమళంలా ఉంటాను ..
నన్ను తెంపాలంటే నీకు మనసేలా వస్తుంది

గులాబీ పువ్వును కోస్తుంటే అది ఆర్ద్రంగా అంది
నీ ప్రేయసి శరీర ఛాయలా ఉంటాను ..
నన్ను తెంపాలంటే నీకు మనసేలా వస్తుంది

ఏ పుష్పాన్ని తెంపాలని చూసిన అవి వాటిని
నీ శరీర అవయవాలతోనే పోల్చాయి ..
నువ్వే అర్థం చేసుకో .. నీ ఎదురుగా సంకోచంతో అన్నిటిని పోల్చలేను

నిరాశగా వెనక్కి వస్తుంటే కాగితపు పువ్వు తనను తీసుకెళ్లమంది
నీలో అందమే ఉంటుంది తప్పా
సువాసన ఉండదు చిరాగ్గా అన్నాను

తను హేళనగా అంది ... నీకింకా అనుభవం కాలేదేమో ..
నీ ప్రియురాలు అచ్చం నాలాగే ఉంటుంది ..
బాహ్యంగానే అందంగా ఉంటుంది .. అంతరంగంగా కాదు ...




** Night queen .. ye aap par nahin... **


thumbnail

*** అసంకల్పితంగా జరిగే కొన్ని చర్యలు..... ***


ఎంతో కాలం తర్వాత 
మాతృదేశానికి వచ్చినపుడు 
కళ్ళు నేలను ముద్దాడుతాయి 
ఎందుకనేది చెప్పలేము

నేలపై కూర్చున్నప్పుడు 
చేతి వేలు ఏదేదో రాసేస్తుంటుంది ..
ఎందుకనేది చెప్పలేము 

అపరిచితురాలైన సరే చిన్నారులతో
చూపులు కలిసినపుడు కళ్ళతోనే ఏదో చెబుతాం
ఎందుకనేది చెప్పలేము

నిర్మానుష్యమైన దారిలో నడుస్తున్నప్పుడు
కాలితో చిన్న చిన్న రాళ్ళను కొట్టుకుంటూ వెళ్తాము
ఎందుకనేది చెప్పలేము

కొందరితో చూపులు కలిసి
వాళ్ళను దాటాక కూడా మందహిస్తూనే ఉంటాము
ఎందుకనేది చెప్పలేము

వర్షం పడే సమయంలో ఒంటరిగా ఉంటే
దోసిలి పడ్తాము
ఎందుకనేది చెప్పలేము
Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.