నిజానికి చిన్న విషయమే ఉంటుంది
నీ విన్నపాన్ని కాదని అంటాను .. అంతే
నువ్వు అసహనంతో ఏదేదో అంటూనే ఉంటావు
వాదించి నీ ఆహాన్ని గాయపరచడం ఇష్టంలేక
నేను ఓడినట్లు మౌనంగా ఉండిపోతాను
నా మౌనాన్ని ఎలా అర్థం చేసుకుంటావోగాని నువ్వెళ్ళిపోతావు
నువ్వు లేకుండా ఉండలేనని నాకు తెలిసినా .. అహం అడ్డొచ్చి ఆపను ...
నువ్వు వెళ్తూ చూసిన నీ చూపులకు అర్థం చేసుకోవడానికి
ఆరోజంత ప్రయత్నిస్తూనే ఉంటాను ..కానీ అర్థం చేసుకోలేక పోతాను
పసిపిల్లాడిని చూసినట్లు చూసే నీ చూపులకు
ఏరోజు అర్థం చేసుకున్నానని .. ఆ రోజు అర్థం చేసుకోవడానికి ....
ఎందుకంటే ఇన్నెళ్లలో నువ్వెప్పుడు నాకు అర్థం కాలేదు .. బహుశ కావు కూడా ...
నువ్వు లేకుండా రాత్రి ఎలాగో గడిచిపోతుంది … రోజులాగే ఉదయం లేస్తాను
సూర్యుడి కిరణాలు నన్ను గుచ్చి తట్టి లేపకపోయిన
ఏవో గుచ్చుకుంటున్న అనుభూతి ...
కొన్ని క్షణాల్లోనే అర్థమౌతుంది అదేమిటో
తడి ఆరని నీ కురులతో నా వదనాన్ని స్పృశిస్తూ
నా నుదుటిని ఆర్తిగా చుంబిస్తూ నన్ను లేపేదానివి
ఆ ఉహే సగం నిర్వీర్యుణ్ణి చేసేస్తుంది ..
మిగిలిన సగం నువ్వు లేవనే విషయం అర్థమై ...
అనివార్యంగా లేచి సిద్ధమైపోతాను
ఎన్ని వ్యాపకాలున్నా పక్కకు పెట్టీసి పదే పదే
ఫోన్ చూసుకుంటాను .. నీ సందేశమేదైనా వచ్చిందేమోనని
ఏ ధ్వని విన్నా ఆత్రంగా లిఫ్ట్ చేయబోయి .. నీది కాకపోవడంతో
నిరాశ పడి ఆ ప్రయత్నాన్నే విరమించుకుంటాను
ఆ సాయింత్రం వరకు అదే ప్రక్రియ ...
చేసిన పనికి శరీరమేమోగాని మనసు మాత్రం అలిసిపోయి ఉంటుంది
నిజం చెప్పాలంటే నీ నుండి ఎలాంటి సందేశం
రానందుకే అది అలసిపోయింది ..
నువ్వు లేని ఇంటికెళ్ళి ఏంచేయను ?
ఆ ఉహే మనసును భారం చేస్తుంది ... తిరిగి వస్తుంటే
బైక్ ను నేను నడుపుతున్నానో ,, అది నన్ను నడుపుతుందో
తెలియదు గాని దారి తెలిసినట్టు ఇంటి వైపు తీసుకెళ్తూ ఉంటుంది
ద్రుష్టే తప్ప మనసు దారిపై ఉండదు
అది నిన్ను వెదుక్కుంటూ ఎప్పుడో వెళ్ళి ఉంటుంది ..
నా ప్రమేయం లేకుండానే ఇక అది నీ గురించి వెళ్ళిందంటే
నాకర్థమైపోతుంది ... నా మనసు నిన్నెంతగా కోరుకుంటుందో ...
తప్పంతా నాదేనని కూడలిలో నిలబడి అరిచి చెప్పాలంత
అనురాగం ఒక్కసారిగా వచ్చేస్తుంది ...
అహం ఏదో చెప్పబోతుంది .. నేను పట్టించుకొను
ఆహాన్ని పక్కకు పడేసి .. నీ నంబర్ కలుపుతాను
నీ ఫోన్ మూగపోయి ఉండగానే ..ఒక్కసారిగా ఉక్రోషం
వచ్చేస్తుంది ..
నువ్వంటే తనకు నిర్లక్ష్యం అని నే చెప్పలేదాని .. అహం వెక్కిరిస్తుంది ...
నువ్వు లేకుండా నేను ఉండలేనా .. ఉండి చూపిస్తాను
ఇంటికి వేగంగా వస్తు రోషంగా అనుకుంటాను
అన్యమనస్కంగా ..ఇంట్లోకి అడుగు పెట్టబోయి
తలుపుకు అడ్డంగా నిలబడి మందహాసిస్తూ
లోనికి వెళ్లకుండా ఆపుతున్న
నిన్ను చూసి అక్కడే నిలబడిపోతాను
నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలో తడి...
నువ్వెప్పటికి నాకర్థం కావు ...ఆర్ద్రంగా అంటాను
తను గద్గదికంగా అంటుంది ..
అర్థమైతే ఇక నాపై ఆసక్తి ఉండదుగా .. ఆసక్తి లేకుంటే నీ స్వరం లో ఆర్ద్రత రాదుగా..
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments