తను వెళ్లిపోయింది ...
వెళ్ళిపోయిన విషయం
చాలా రోజుల వరకు తెలియనే లేదు
ఈ వాక్యాన్ని ఇలా రాయాలా .. లేక ఇంకోలా రాయాలా ..
అర్థం కాలేదు .. వెళ్లిపోయింది అంటే వదిలి పోయిందనా ?
లేక , చాలా రోజుల వరకు తెలియలేదు ..అంటే తనపై ఆసక్తి ఉంటే కదా .. అనా ..
నిజానికి తను జ్ఞాపకం ఉంచుకొనెంత పరిచితురాలు కాదు
ఆలాని నిర్లక్ష్యం చూపెంత అపరిచితురాలు కాదు
ఒక చిన్న పరిచయం .. చాలామంది లాగే ..
తనకున్న ఎందరిలో నేను .. నాకున్న కొందరిలో తను ..
ఎవరు ఎవరి నుండి ఏదో కోరుకొనే
ఏదో ఆశించే దశ కాదు .. ఇద్దరూ వెళ్లాల్సిన దిశ కూడా ఒకటే కాదు
నిజానికి ఏదో ఆకర్షణకు లోనయ్యే వయసులు కాదు
ఏదో స్వాంతన పొందుదామనుకొనే భగ్న మనసులు కాదు
చాలా దూరం నడిచాక ఎక్కడో కాసేపు ఆగి సేద తీరడం కోసం తప్పా
తను నా గురించి .. నేను తన గురించి ఎక్కడ ఆగలేదు
ఏది జరగనప్పుడు .. వెళ్లిపోయిందనో ..
వెళ్ళిపోయిన చాలా రోజులకు తెలియలేదనో ..
చెప్పుకోవడం ..నిజమే అయితే
వెలితి అనేది లేదని చెప్పుకోవడం నిజం కాదేమో ..