Followers

Tuesday, June 24, 2014

thumbnail

!! భార్య ... !!




జీవన వసంతాలు కొన్ని 
తన వాళ్ళలో గడిచాక 
ఒకరి జీవితలోకి వెళ్ళి 
ప్రవహించే నదిలో ... పాయాలా 
ఆమె అతనితో కలిసిపోతుంది

అప్పటి వరకు ఎన్నో బంధాలను
తన అనురాగం ద్వారా ప్రభావితం చేసి
అతని హృదయంలో
సుస్థిర స్థానం ఏర్పర్చుకుంటుంది

బానిస కాకున్నా అన్నీ సపర్యలు చేసి ...
యజమాని కాకున్నా తన నడవడికతో
అతని నడకను సైతం
నిర్దేశించే స్థాయికి వస్తుంది

ఓటమిలో ఓదార్పును ..గెలుపుకు ప్రేరణను ఇస్తూ
అతని ప్రతి అంశం తో ముడి పడి ఉండి .....
అమాయకత్వంగా సూచనలు ఇస్తూనే
అనివార్యంగా ఆచరించేలా చేస్తుంది

తెలియకుండానే అతని జీవితం తనపై ఆధారపడేలా
ఆలంబన అవుతూ ..తనే అల్లుకుపోతుంది
లొంగిపోతున్నానేమో అహం అతన్ని హెచ్చరించినపుడల్లా
ఆహాన్ని బలపరిచే ఏ ఒక్క కారణంగా కనిపించక
సహనాన్నే సమ్మోహనంగా చూపుతుంది

జీవితాన్నిఅతనికి అనుగుణంగా మార్చుకుంటుంది .. ఆలానీ
తనకంటూ ఉన్న వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోదు
నడవడికతో ప్రభావితం చేసి అవసరమైన
స్వేచ్చను బహుమతిగా పొందుతుంది

అప్పటి వరకు ఎన్నో సాయింత్రాలు
ఎక్కడెక్కడో గడిపే అతన్ని
ఇంటికి త్వరగా వచ్చేలా
తనను ఆసక్తికరంగా మలుచుకుంటుంది

తన సహాయం లేకుండా ఏ పని చేయలేడనే
బలహీనత అతనిలో రప్పించి
అతని బలం కూడా తనతోనే అనే
నమ్మకాన్ని పెంచుతుంది

తను ఏది చేసిన అతని సంతృప్తి కోసమే చేసి
అతని ఆనందం కోసమే జీవిస్తుంది ....
ఎందుకంటే ...
ఒక అందమైన సంస్కృతిని జీర్ణించుకున్న ఆమె
అతనికి ఇల్లాలు .... ..




Sunday, June 15, 2014

thumbnail

!! నాన్న ..... !!



శైశవం లో నేనేడిస్తే అమ్మకు నిద్ర భంగమని 
మా నిద్ర కోసం నీ నిద్రను పంచావు

మేము స్వేదంలో తడిస్తే 
నువ్వు వాయువయ్యావు
 
మా చీకటిని దూరం చేయడానికి 
నువ్వు వెలుతురయ్యావు 

మా వదనాల్లో సంతృప్తిని వెదికావేగాని 
నీ అలుపును ఎప్పుడు చూపించలేదు
 
మా కడుపులు నింపడానికే చూసావేగాని
నీ ఆకలిని ఎప్పుడు చూపించలేదు


బాల్యంలో తప్పటడుగులకు ఆసర అయ్యావు
యవ్వనంలో తప్పటడుగులు పడకుండా మార్గదర్శి అయ్యావు 

పరువుకు హద్దు చూపిస్తూనే పూర్తి స్వేచ్చను ఇచ్చావు 

విజయాలకు మెట్లువయ్యావు పడినట్లనిపిస్తే ఆసరావయ్యావు
నువ్వు నాటిన మొక్క వృక్షమయ్యేవరకు ఆలంబన అయ్యావు 


ఇక ఈ వృక్షాన్ని ఏ తూఫాను కదిలించలేదు అనుకున్నావో
నా నీడలో విశ్రమించకుండా ... వెళ్లిపోయావు నాన్న ... 


నా సంతానం కోసం నీలా కష్టపడలేను
ఆ బాధ్యత నువ్వు నేర్పలేదని కాదు ..
ఆ అవసరం రాకుండా సర్వం ఇచ్చివెళ్లావు ....
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ....



Friday, June 13, 2014

thumbnail

** Life..... **




నేను ఒక జీవితాన్ని ... 
ఆరంభంలో నాకు పరిపూర్ణమైన ఆకృతి ఉండేది. 
స్వంత వ్యక్తిత్వంతో నైతికవిలువలతో కూడిన 
ఆ ఆకృతి తోనే నిష్క్రమిస్దామనుకొనేదాన్ని 

శైశవదశలోనే నా ఆకృతిలో స్వల్ప ప్రకంపనాలు
నేనెలా ఉండాలో అన్నది నాచేతుల్లో కాక
నాకు జన్మనిచ్చిన వాళ్ళ చేతుల్లో ఉండటం వలన కావచ్చు .....

కాలం ముందుకు సాగాకా .... నాకై నేనుగా జీవించి
నా ఆకృతిలో మార్పు రానీకూడదు అనుకున్నాను
కానీ .. నాకై నేను జీవించే సందర్భమే రాలేదు

ఒకరి మెప్పు పొందడానికో ,
అందరిలో గొప్పగా అనిపించుకోవాలనే తపనకో
నా వ్యక్తిత్వంలో అసహజంగా మార్పు తెచ్చుకున్నప్పుడు
నా ఆకృతి మళ్ళీ కదలిక ....

అర్హత లేకపోయినా అన్నీ పొందాలని
నా స్థాయిని మరిచి ఆర్భటాలకు వెళ్ళాను
జింకనై ఉండి పులి తోలు కప్పుకున్నప్పుడు
నా ఆకృతిలో మళ్ళీ కదలిక ....

నాలోని లోపాలను దాస్తు
లేని ఘనతను చాటుతూ
గుర్తింపు పొందడానికి ప్రయత్నించినపుడు
నా ఆకృతిలో మళ్ళీ కదలిక ....

ఉన్నంతలో హాయిగా ఉండే అవకాశం ఉన్న
ఇతరులతో పోల్చుకుంటూ ,
అవినీతికై దిగజారినపుడు ....
నా ఆకృతిలో మళ్ళీ కదలిక ....

ప్రేమకో .. మొహానికో . కామానికో
నైతికత మరిచి
మరో ముసుగు వేసుకున్నప్పుడు
నా ఆకృతిలో మళ్ళీ కదలిక ...

ఆకృతి పొరలు ..పొరలుగా రాలుతూ ఉండటం చూసి
ఆత్మవిమర్శ దర్పణంలో చూసా .....
నా ఆకృతి నన్ను చూసి జాలిగా నవ్వింది

దుః ఖం పొరలు పొరలుగా వచ్చింది
అయ్యో నేనిలా కోరుకోలేదే ...
నా పరిపూర్ణ ఆకృతి నేనెలా పొందనూ
విలపిస్తుంటే.... ఆకృతి అన్నది

పిచ్చి జీవితమా ఇప్పుడు రోదించిన
నా పరిపూర్ణత నీకు రాదు
ఒకటే నువ్వు చేయగలిగింది
నీలాగే మరికొన్ని జీవితాలు
ఆకృతిని కోల్పోయి ఉన్నాయని తృప్తీ పడూ

లేదా ...
ఇకనుండైన ఇతరుల మెప్పుకై జీవించడం మాని
ఇప్పుడు పునీతమైన నీ వ్యక్తిత్వం మాట విని
మిగిలిన ఆకృతినైనా కాపాడుకో .......



Thursday, June 12, 2014

thumbnail

!! ఎప్పుడొస్తావో .....!!




రోజు ఒక్కసారైనా ఆకాశంలో చూస్తాను 
ఏ మబ్బు తునకల్లో 
నువ్వు దాగున్నావేమోనని ....

రావా ! ? ..... ఇప్పుడే రాలేవా ! ?
ఒహో ... సమయానికి ముందే
ఎలా రావాలని నీ సందిగ్దమేమో ...

చూడు నీకోసం ...
ప్రసవం తర్వాత తొలి సంతానాన్ని
గుండెలకెప్పుడు హత్తుకోవాలా అని
తపించే తల్లిలా .... అవని ఎదురు చూస్తుంది

సంవత్సరాలుగా దూరం ఉంటున్న
భర్త కోసం విరహంలో
జ్వలిస్తున్న భార్యలా ... వృక్షాలు ఎదురు చూస్తున్నాయి

కాగితపు పడవలు చేయడం
నేర్చుకున్న పసివాళ్లు
కళ్ళు మూసుకొని నువ్వు వస్తున్నవైపే సూటిగా
తన్మయత్వంగా చూడాలనుకుంటున్న ఎన్నో వదనాలు

నిన్ను ఒక్కసారి తీసుకొని
గాలిలో ఎగరేస్తూ
ఆడుకోవాలనుకున్న ఎన్నో దోసిళ్ళు ...

ఎవ్వరైన నవ్వుకుంటారనే
సంకోచాలన్నీ వదిలి
నృత్యం చేద్దామనుకొనే అందరూ వయస్కులు

ఇలా అందరూ నీకోసం నిరీక్షిస్తున్నారు ...
ఇక నేనా ...?
నేనూ ఎదురుచూస్తాను ...
నువ్వు వచ్చాకా కంటే ...
నీ రాకకు ముందు ఉండే లక్షణాలా కోసం ఎదురుచూస్తాను

రాకుమారి నగర వీధుల్లో వచ్చే సందర్భంలో
పరిసరాలు ఎంత ప్రశాంతంగా మారిపోతాయో
నీరాకకు ముందు వాతావరణంలో అలా ప్రశాంతత వచ్చేస్తుంది
గ్రీస్మం తన ఓటమిని అంగీకరిస్తూ తాపాన్ని తగ్గించు కుంటుంది
వెలుతురు తన తీక్షణత కోల్పోయి మసకబారుతుంది
నిండు గర్భిణిలోని పరిపూర్ణత మేఘాల్లో వచ్చేస్తుంది ....

ఆ అందాలన్నీ ఆస్వాదిస్తూ అంటాను
ఓ వర్షమా ...త్వరగా రావా ...
నీకోసం ఎదురుచూస్తున్న
అందరినీ నిలువెల్లా తడిపిపోవా .......




Monday, June 2, 2014

thumbnail

రాతి హృదయం



ఒక మ్యూజియంలో ఓ వస్తువు దగ్గర ఇలా వ్రాసి ఉంది 

వినోదానికి , విషాదానికి 
పుష్పాలకు భాష్పాలకు 
బహుమతికి , తిరుస్కృతికి
విన్నపానికి , అమ్మకానికి
విజ్ఞాపనకు , ఆజ్ఞాపనకు ...
నడిచే దారిలో పూలు పరిచిన వారికి
నిద్రాహారాలు మాని తపస్సు చేసినవారికి
స్తుతిస్తూ కవితలు రాసిన వారికి
అందంగా చిత్రాలు గీసిన వారికి
అందంతో ఆకర్షించాలనుకున్న వారిని
ఐశ్వర్యంతో ఆకట్టుకోవాలనుకున్న వారిని
కరుణాకటాక్షాల కోసం ఎంతో దూరం నుండి వచ్చిన వారికి
వెళ్ళే రహదారిలో ఓపికగా ఎదురుచూసిన వారికి
..... దేనికి చలించని ఒక అందమైన అమ్మాయి మరణించాక ప్రేమికులందరు కలసి ఆమె శరీరాన్ని శస్త్ర చికిత్స చేయించారు .. ఆమె హృదయ స్థానంలో ఉన్న దీనిని తీసి దిగ్భ్రాంతి చెంది .... ఇలా రాసి భద్రపరిచారు




thumbnail

** షరాబ్ ... తుమ్ హొ ఖరాబ్ **



ఒకానొక సందర్భంలో మద్యం నాతో అన్నది ...
అమాయకుడివో , అసమర్థుడివోగాని నిన్ను చూస్తే జాలేస్తుంది
నా ఇంత సమీపానికి వస్తావు .. నన్ను సేవించే వాళ్ళతో కూర్చుంటావు
నా రుచి చూడాలని ఒక్కసారి కూడ నీకు అనిపించదా ?
సంకోచిస్తుంటావో , సిగ్గు పడ్తుంటావో నాకు తెలియదు కానీ ,
ఒక్కసారి నా రుచి చూడు . ....

చేదుగా అనిపిస్తానేమోగానీ నాలొ ఎన్నో సుగుణాలు ఉన్నాయి ...
నిద్రలేమి వాళ్ళకు నిద్రను రప్పిస్తాను
నిస్ప్రుహలో ఉన్నవాళ్ళకు ఉత్తేజాన్ని ఇస్తాను
దుఖ్హంలో ఉన్నవాళ్ళకు దుఖ్హాన్ని తగ్గిస్తాను
ఆనందంలో ఉన్నవాళ్ళకు మరింత ఆనందాన్ని ఇస్తాను
బిడియంగా ఉండేవాళ్ళకు నలుగురిలో మాట్లాడగలిగే ధైర్యాన్ని ఇస్తాను
పిరికి భర్తకు భార్యతో వాదించగలిగే శక్తిని ఇస్తాను

ఒకటేమిటి నాతో ఎన్నొ ప్రయొజనాలు ఉన్నాయి
వినోదంలో ,విషాదంలో
విరహంలో , విఫలంలో
నన్నే కోరుకుంటారు .. అన్నిటికంటే నాలో ఉన్న సుగుణం
మద్యం తాగినోడు అబద్దం చెప్పడు అని నా గురించి అందరు గొప్పగా చెబుతుంటారు
ఎన్నో ప్రమాణాలు , ఎన్నో పరీక్షలు చేయించి కుడా నిజాన్ని శంకించే ఈ రోజుల్లో
నేను నిజాన్ని కక్కిస్తాను అనడం నా సుగుణం కాదా ..

సరే ఇవన్నీ ఎందుకూ ..
ఫ్రేమలో విఫలమైన వాళ్ళు ..  పెళ్ళై సఖ్యతగా ఉండలేని వాళ్ళు
భార్య ఉండీ ప్రేయసిని మర్చిపోలేని వాళ్ళు ..
భర్తను లెక్క చేయక జల్సాగా బ్రతికే వాళ్ళు ...
ఇలా ...శారీరకంగా , మానసికంగా అలసిపోయే ఎందరికో
నేను ఉపశమనాన్ని ఇస్తాను

అసలు నువ్వేంటీ ? వీటన్నిటికి అతీతుడివా ?
అదే నిజమైతే ఏదో పోగోట్టుకోనేవాడిలా ఉండవే ..!?
నా మాట వినూ .. మద్యం తాగని వాడిని ఊత్తముడు అనరు .. అసమర్థుడంటారు
వాడి సాంగత్యాన్ని ఎక్కువమంది కోరుకోరు ...
అందుకే నా రుచి చూడూ ,,,

నేను అది విని చిద్విలాసంగా అన్నాను ...
ఎందరినో భ్రమింపచేస్తావు కదా .. నువ్వదే భ్రమలో ఉన్నవూ ..
నీకు మాత్రమే కనిపించే సుగుణాల గురించి చెప్పావు .. నీ దుర్గుణాల గురించి వింటావా ?
జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నవాడికి ,
కుటుంబాన్నే కాదు బంధుమిత్రులను ప్రేమించే వాడికి ఏ కోశనా నీ అవసరం రాదు .
భార్యను అర్థం చేసుకున్నవాడికి వాదించగలిగే అవసరమేరాదు .
నీ ప్రమేయం మితిమీరినపుడు వినోదం విషాదంగా మారిపోతుంది .
నిన్ను సేవించే వాడికి  ఇంటి పేరు లాగా తాగుబోతు అని  జత కలుస్తుంది .

సమాజంలోనే కాదు  అతని పిల్లల దృష్టిలోనే కూడా  చులకనై ఉంటాడు .
తనను దగ్గర తీసుకున్న అతన్ని ఏమనలేక  భార్య శవంలా శరీరాన్ని అప్పగిస్తుంది .
ఎవరితోనైనా గట్టిగా మాట్లాడితే బాస్ రాత్రిది దిగలేదా అంటారు .
అతనెన్ని నిజాలు చెప్పిన వాడి మాటలకేం తాగి ఏదో వాగుతూ ఉంటాడు అంటారు .
నీకెన్నో దుర్గుణలున్నా ముఖ్యంగా నిన్ను సేవించే వాడి
డబ్బునే కాదు ఆరోగ్యాన్ని తినేస్తావు .. ఏదో రోజు ప్రాణాన్నే తీసుకుంటావు ....

ఏమంటావు నేను ఏదో పోగొట్టుకొనేవాడిలా ఉంటానా ?
నిజమే .. ఉంటాను.
నిన్ను సేవించి ప్రాణాలు కోల్పోయిన నా ఆప్తున్ని పోగొట్టుకున్నాను కనుక ......


Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.