Followers

Tuesday, December 24, 2013

thumbnail

ఇంకేం చేయలేక ...



నిజానికి నువ్వేమి కావు 
కానీ .. అలా అనుకోడానికి  
నా మనసు ఒప్పుకోదు

నిజానికి నువ్వెoతో  దూరం 
కానీ ... చూడకుండా ఉండటానికి 
నా దృష్టి ఒప్పుకోదు … 

నిజానికి నువ్వొక అందమైన జ్ఞాపకం 
కానీ... గతమనుకోవడానికి 
నా వర్తమానం ఒప్పుకోదు

ఇవన్నీ .. నీకు చెప్పలేక 
ఒకరితో పంచుకోలేక 
మనసుకు ఒప్పించుకోలేక 
వాక్యాల్లో  రాయలేక ... 

హృదయపు అట్టడుగులో  
నిక్షిప్తం చేసి 
అది కనిపించకుండా ఏవేవో 
వ్యాపకాల రాళ్ళెస్తాను

కానీ ... తొలిసంధ్య కిరణాల్లో
అప్పుడు వీచే చిరుగాలుల్లో  
మంచుబిందువులతో స్నానించిన పుష్పాల్లో 
అర్ధరాత్రి దాటాక కనిపించే వెన్నెల్లో
నిశభ్దపు వేళ వినిపించే శ్రావ్యమైన ధ్వనిలో  ....  

ఇలా బాహ్యంలో కనిపించే ప్రతి అందంలో 
చివరికి విధాతను స్మరించాలని చేసే ఏకాగ్రతలో 
నువ్వు కనిపిస్తూ ఉంటావు .. అలా కనిపించినప్పుడల్లా 
నిక్షిప్తమై ఉన్నా ఎన్నో భావాల్లో కదలిక ....

వాటిని స్థిమితం చేసే ప్రయత్నంలో 
ఎన్నో చర్యలు చేసి ..చేసి చివరకు
బాధగా కళ్ళు మూసుకుంటాను 

అప్పటి వరకు కనురెప్పల ముడతల్లో ఉన్న 
నీ రూపం ఇంకా స్పష్టంగా ఎదురుగా సాక్షాత్కరిస్తుంది 
అలాగే ఉండిపోతాను 
నా పరిస్థితికి ఇంకేం చేయలేక ....



Sunday, December 8, 2013

thumbnail

!! చేయూత ఇస్తారు కదూ ... !!



  • ఎందుకమ్మా ఇలా చేసావు .. వినడానికి నువ్వు ఉండి ఉంటే నేఁ అడిగే దాన్ని కానేమో ... నేను అనుభవిస్తున్న జీవితాన్ని చూసి నువ్వే ఒప్పుకొనేదానివి నీ సుఖం కోసమో , నీకు నచ్చిన వాళ్లందరికి శరీరాన్ని ఇచ్చి చేసిన త్యాగం కోసమో డబ్బుకో , మరిదేనికో ఎవరి బీజమో కూడ అర్థం చేసుకోలేక నీ గర్భంలో నన్ను మోసావు నా పుట్టుకకు కారణమేవరో తెలుసుకోలేని నువ్వు నీకు అంటించిన భయంకరమైన వ్యాధికు కారణమేవరో ఎలా తెలుసు కుంటావులే ...
    నీకు తెలిసో ,తెలియకో ఎంతో మందికి దాన్ని బహుమానంగా ఇచ్చి ఉంటావు ...
    నువ్వు చేసింది పాపమో . త్యాగమో నాకు తెలియదు ..కానీ దాని ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను తల్లి ఎవరో చూపించలేను తండ్రి ఎవరో చెప్పలేను
    ఎంతమంది చిన్నారులు నాలా మృత్యువును అతి సమీపంగా చూస్తూ ఈ ఆశ్రమంలో దీనంగా ఉంటారో ఎవరికి తెలుసు
    ఈ దైన్యాన్ని మర్చిపోతానో లేదో తెలియదు కానీ విచిత్ర జంతువులను చూసేలా జనాలు చూస్తారే దాన్ని మర్చిపోలేక పోతున్నాను
    మరణిస్తానని నాకు తెలుసు వాళ్ళకు తెలుసు నాకు తెల్సిన ఒక విషయం వాళ్ళకు తెల్సో తెలియదో నాకు తెలియదు
    మాకీ సమయంలో కావాల్సింది సానుభూతి ..స్వాంతన కాదు AIDS బాధితులు అంటరాని వాళ్లు కాదనే చేయూత ఆఖరి శ్వాస వరకు అందరిలో ఒకరమే అనే మానసిక స్థైర్యం ...
    AIDS DAY Sandarbhangaa raasina oka kavita

  • చేయూత ఇస్తారు కదూ … !! | విహంగ
    shar.es
    vihanga.com -



Monday, November 25, 2013

thumbnail

అల్లికల్లు ... కొన్ని ..



నేన్నన్నాను .. సర్వ ప్రపంచానికి చెప్పేయి నువ్వు నాదానివని 
తను నా చెవిలో అలాగే చెప్పింది 
నా చెవిలో కాదు .. సర్వ ప్రపంచానికి చెప్పేయిఅన్నాను
తను చిర్నవ్వుతు చెప్పిందిలా  ..
ఇప్పుడు చేసింది అదేగా.. నీ తప్ప నాకు ప్రపంచం అంటూ దుందని ......


**********************************************************************************
నువ్వు నాతో నన్ను అడిగావు ..
నేను నీ కానప్పుడు కదా నువ్వడగాలి ...

**********************************************************************************

ఎందరో నాకెందుకు ... ఒక్కరు చాలు .. 
బయిటికెలా కనిపిస్తారో 
లోపల కూడ అలాగే ఉండేవారు ...

 **********************************************************************************


నీ రూపాన్ని లిప్తకాలం చూసే శ్వాసించడం మరిచాను 
నువ్వు రోజు అద్దంలో నిన్ను చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు

**********************************************************************************


నా హృదయంలో ఉండి హృదయాన్నే గాయపరుస్తావు 
నాలో నీ స్థానం ఎంత ఉన్నతంగా ఉందో చూడు ... 
నువ్వు చేసే చర్య ఎంత నీచమైందో చూడు

 **********************************************************************************


వైద్యుడా ! నా వ్యాధికి ఇప్పుడే ఔషధాలు ఇవ్వకూ ...
ముందు నువ్వెవరినైనా ప్రేమించు ...
తను నిన్ను దూరం చేయని ..
 క్షోభ నువ్వు అనుభవించు ....
అప్పుడు నాకు చికిత్స ప్రారంభించు ....

**********************************************************************************


ఏకాంత జీవితానిది కూడ ఒక మంచి స్వభావం 
ఎవరో వస్తారని ఎదురుచూపు ఉండదు 
ఎవరో వెళ్లిపోతారని భయం ఉండదు 

**********************************************************************************


నన్నెంతగా హింసిస్తాయి నీ జ్ఞాపకాలు 
లేకుంటే కవితలు రాయడం నాకేమైనా ఇష్టమా ..?




Sunday, November 24, 2013

thumbnail

!! నువ్వూ చెప్పలేవేమో ....! !!


మనసు ఉదాసీనంగా ఉన్నప్పుడు 
నువ్వు జ్ఞాపకం వస్తావో 
నీ జ్ఞాపకం వచ్చాకా మనసు 
ఉదాసీనంగా మారుతుందో తెలియదు ...

ఎన్నో వ్యాపకాలు ఎందరో ఆప్తులు
ఆహ్లాదాన్నిచ్చే ఎన్నో అంశాలు ..ఎన్ని ఉన్నా ...
వాటన్నిటిని నెట్టివేస్తూ ....
నీ జ్ఞాపకాలు వస్తాయి

మనం దూరమై ఇన్ని రోజులైనా ..
రోజు రోజుకి సాంద్రత తగ్గక పోయి
మరింత బలాన్ని కూడగట్టుకొని వచ్చే నీ జ్ఞాపకాలు
ఎంత శక్తివంతమైనవో అంచనకు రాలేను

ఒక ఆర్ద్రమైన భావం మాత్రం
మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది
నీ జ్ఞాపకాలకే మనసులో ఇంత స్థానం ఉంటే
నీకెంత స్థానం ఉండేదో అర్థం చేసుకోలేకపోయావు

పరిహాసానికో , పరిస్థితిని రప్పించడానికో తెలియదు గాని
నేను వెళ్లిపోతే ఎలా ఉంటావని నువ్వు అడిగేదానివి
నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను
అలాగే ఇకపై ఉంటానని ... ఏదో అనేవాన్ని

కానీ అది నిజం కాదు అనేది
ఆ సమయంలోనే కాదు ఇప్పటికీ
తెలుస్తూనే ఉంది ..

మరొకరి జీవితాన్ని స్వర్గమయం చేస్తూ
నువ్వు ఎక్కడో ఉండి ఉంటావు
నిన్నిలా జ్ఞాపకం చేయడం భావ్యం కాదు

కానీ .. సర్వం ఉన్నా ,
ఏ లోటు రానివ్వకుండా చూసుకొనే
జీవిత భాగస్వామి ఉన్నా ..
ఆ ప్రేమలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఆనందం ఉన్నా ...

ఏదో సమయంలో , ఏదో సందర్భంలో
ఎందరో ప్రేమికుల హృదయాలను , ....
అది మోసపోయి ఉండని..మోసగించి ఉండనీ
వినోదాన్ని ఇచ్చిఉండని , విషాదాన్ని ఇచ్చి ఉండనీ
అహంతో వీడిపోనీ ..స్వాభిమానంతో దూరం కానీ
అనుమానంతో అంతమైపోనీ , అపార్థంతో వీగిపోనీ
తొలి ప్రేమ అనేది జ్ఞాపకం రాకుండా ఉండదు కదా ...

ఆ ఆలోచనే నా నైతికతను
సమాధాన పరుస్తూ ఉంటుంది
నేను మానసికంగా వ్యభిచారిస్తున్నానో
ఆత్మవంచన ముసుగు లేకుండా
పారదర్శకంగా ఉంటున్నానో ...చెప్పలేను

నా పరిస్థితిలో నువ్వూ ఉంటావు
అని చెప్పలేను ..ఉంటే మాత్రం
బహుశ నువ్వూ చెప్పలేవేమో ....



thumbnail

!! ఎప్పుడు వస్తావు నాన్న ! ? .... !!





నాకు మాటలు రాని ప్రాయంలో
నువ్వెన్నో మాటలు చెప్పి
నన్నెత్తుకొని
మళ్ళెప్పుడు వస్తానోనని 
కన్నీళ్లు పెట్టుకొని
దూరదేశానికి వెళ్లిపోయావటా..

నిద్రపుచ్చడానికి అమ్మ
నీ కథలే చెబుతుంది
నాకిప్పుడు మాటలు వస్తున్నాయి నాన్న
ఆప్పుడు నువ్వు పెట్టుకున్న కన్నీళ్లు
ఇప్పుడు నాక్కూడ వస్తున్నాయి

దూరం వెళ్ళితే
డబ్బులెక్కువ వస్తాయని
అమ్మ చెబుతుంది
అదే నిజమైతే
సంతోషాపడాలి గాని
మరి రాత్రుళ్లు ఎందుకేడుస్తుందో
అమ్మ ఎప్పుడూ చెప్పదు

ఇంట్లో ఏ పండుగలైన
అన్నీ చేస్తుంది
అందరిని నవ్విస్తుంది
పెరట్లో వెళ్ళి ఒక్కతే ఏడుస్తుంది

ఇన్నిసార్లు ఏడుస్తుందంటే
నాలాగా అమ్మకు కూడా నిన్ను
చూడాలని ఉందేమో నాన్న

నేను ఏడిస్తే అమ్మ ఉంది నవ్వించడానికి
అమ్మ ఏడిస్తే ఎవరు నవ్వించాలి నాన్న
ఎక్కువ దూరం వద్దు ..ఎక్కువ డబ్బులు వద్దు
నువ్వచ్చేయి .... నాన్నా నువ్వచ్చేయీ ...


Tuesday, October 22, 2013

thumbnail

చివరి కోరిక....




ఇంకేం అనుకోవాలి ఇప్పుడు ...
కన్నార్పకుండా నన్ను చూసినపుడే అర్థమైంది ..
నువ్వు దూరం అవుతున్నావని ...

దూరమయింది నువ్వొక్కదానివే కాదు
నా సర్వాన్ని తీసుకెళ్లిపోయావు
ఆహ్లాదంగా స్పందించే హృదయాన్ని
పెదాలు వీడని మందహాసాన్ని

ప్రకృతిని ప్రేమించే తన్మయత్వాన్ని
మల్లెల్ని , వెన్నెల్ని
పక్షుల కిలకిలా రవాల్ని
గోధూళి వేళ కనిపించే సూర్య కిరణాల్ని
ప్రతి దానిలో నిన్ను వెదుక్కోనే నా అమాయకత్వాన్ని ...

అన్నింటిలో విరక్తిని కలిగిస్తూ ....  ఎన్నెన్ని తీసుకెళ్లిపోయావు ..
కొన్ని వదిలిన .. వాటిని చూస్తే నీ వియోగం
గుర్తుకొచ్చే ఒక భయాన్ని మాత్రం వదిలిపోయావు  

ఒకప్పుడు వెన్నెల మామూలుగా అనిపించేది
నువ్వు నా జీవితంలో వచ్చాక ఎంతో ఆహ్లాదంగా అనిపించేది
నువ్వు వెళ్లిపోయాక ఇప్పుడు వెన్నెల అంటేనే భయాన్ని కలిగిస్తూ ఉంది
అలా వెన్నెల దూరమైయింది

ఒకప్పుడు మల్లెలు మామూలుగా పుష్పాల్లా అనిపించేవి
నువ్వు నా జీవితంలో వచ్చాక ఎంతో ఆహ్లాదంగా అనిపించేవి
నువ్వు వెళ్లిపోయాక ఇప్పుడు మల్లెల్ని చూడాలంటే భయం అనిపిస్తుంది  
అలా మల్లెలు దూరమయ్యాయి

దూరమైనవి చెప్పుకుంటే వెళితే చాలా దూరం వెళ్లిపోతాను
అయిన ఎంత దూరం వెళ్ళిన 
నే వెళ్ళే  దూరం నువ్వు వెళ్లిపోయినంత దూరం ఉండదు లే ...  

నువ్వు ఎన్నోసార్లు చెప్పావు .. దేవుడు నీ ప్రతి కోరిక తీర్చాడని
అర్థం చేసుకోలేని పిచ్చిదానివి .. వాడు సామాన్యుడు కాడు
అన్నీ నీకిచ్చి నువ్వు మురుస్తున్న సమయంలో నిన్ను లాక్కున్నాడు

అబద్దం అనిపిస్తే చివరి కోరికగా ఇలా  కోరు ...
దేవుడా నేనిక్కడ ఒంటరిగా ఉండలేను 
నా కోసం ఇంకా ఒంటరిగా ఉన్న అతన్ని నాదగ్గరికి చేర్చు ...  





Saturday, October 19, 2013

thumbnail

|| siri మల్లెలు ....||




నువ్విలా ఉంటావు ...

నిశీది వలవలు ఒక్కొట్టిగా జారవేస్తుంటే 
అస్పష్టంగా బహిర్గతమయ్యే తొలి సంధ్యలా ....
తొలి సంధ్యలో వినిపించే పక్షుల 
కిలకిలా రవాల శ్రావ్యతలా ....
గోధూళి వేళ అమాయకంగా గంతులు వేస్తూ 
తల్లిని అనుసరించే లేగ దూడలా .....
గ్రీష్మం తర్వాత కురిసి ఆహ్లాదాన్ని 
ఇచ్చే మొదటి వర్షపు చినుకులా ....
వర్షం వెలిసాక నీటి బిందువుపై పడి
విశ్లేషం చెందే కిరణంలా ....
వర్షం కురుస్తున్నప్పుడు కూడ
అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే నులి ఎండలా .....
తొలి సంగమానికి సంసిద్ధమయ్యే
నవ వధువు మస్తిష్కంలా ...

అధరాల తొలి కలయికలో
వెన్నులోంచి వచ్చే జలధరింఫులా ...
పాల్ఘున మాసపు చలిలో చెలికాడి
వడి నిచ్చే నులివెచ్చని అనుభూతిలా ...
ప్రసవ వేదన మరిచి తొలి సంతానాన్ని
చూసే మాతృ హృదయంలా ....
తొలిసారిగా పాఠశాలకు వెళ్తూ వెనక్కి తిరిగి
తల్లిని చూసే పసివాడి బేలా చూపులా ....
గోరింటా పండిన చేతులను
చూసుకొని మురిసే పసిపాపలా ...
వసంతాల అనంతరం మాతృ భూమిపై అడుగిడినపుడు
కలిగే అనిర్వచనీయంగా కలిగే ఆనందం లా .......





****  నిజానికి ఒకప్పుడు ఇది ఎందుకు రాసానో చెప్పలేను .. కానీ మిమ్మల్ని చూడక ముందు .. మీతో మాట్లాడక ముందు ఇది రాసాను . మీతో కలసి ఇంటికి వచ్చాక మళ్ళీ దీన్ని చూశాను .. నేను ఎలా రాసానో మీరు అలాగే ఉన్నారు ... మీ ఫోటో చూసాక ఎందుకో దీన్ని మళ్ళీ పోస్ట్ చేయాలనిపించింది ... మీ అందాన్ని నిర్వచించడమే తప్ప మరో దురుద్దేశం తో మాత్రం కాదు సుమా ... క్షమాపణలతో .... *****

Wednesday, October 16, 2013

thumbnail

!! నువ్వే అయినప్పుడు .... !!





నువ్వొక మానలేని గాయం అని ఎలా అనుకోనూ
దాన్ని మాన్పించే లేపనం నువ్వే అయినప్పుడు .... 

నువ్వొక విషాదం అని ఎలా అనుకోనూ
ఉదాసీనతలో వచ్చే ఆహ్లాదం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక స్వప్నం అని ఎలా అనుకోనూ
బాహ్యంలో చేరదీసేది నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శిశిరం అని ఎలా అనుకోనూ
చిగురునిచ్చే వసంతం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక సమస్య అని ఎలా అనుకోనూ
అన్నిటికి పరిష్కారం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక నిశివి అని ఎలా అనుకోనూ
శశివై వెన్నెల్ని కురిపించేది నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శాపం అని ఎలా అనుకోనూ
విధాత ఇచ్చిన వరం నువ్వే అయినప్పుడు ....

నువ్వొక శత్రువు అని ఎలా అనుకోనూ
నా దీర్ఘాయుస్సు గురించి ప్రార్థించేది నువ్వే అయినప్పుడు ....



Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.