మనసు ఉదాసీనంగా ఉన్నప్పుడు
నువ్వు జ్ఞాపకం వస్తావో
నీ జ్ఞాపకం వచ్చాకా మనసు
ఉదాసీనంగా మారుతుందో తెలియదు ...
ఎన్నో వ్యాపకాలు ఎందరో ఆప్తులు
ఆహ్లాదాన్నిచ్చే ఎన్నో అంశాలు ..ఎన్ని ఉన్నా ...
వాటన్నిటిని నెట్టివేస్తూ ....
నీ జ్ఞాపకాలు వస్తాయి
మనం దూరమై ఇన్ని రోజులైనా ..
రోజు రోజుకి సాంద్రత తగ్గక పోయి
మరింత బలాన్ని కూడగట్టుకొని వచ్చే నీ జ్ఞాపకాలు
ఎంత శక్తివంతమైనవో అంచనకు రాలేను
ఒక ఆర్ద్రమైన భావం మాత్రం
మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది
నీ జ్ఞాపకాలకే మనసులో ఇంత స్థానం ఉంటే
నీకెంత స్థానం ఉండేదో అర్థం చేసుకోలేకపోయావు
పరిహాసానికో , పరిస్థితిని రప్పించడానికో తెలియదు గాని
నేను వెళ్లిపోతే ఎలా ఉంటావని నువ్వు అడిగేదానివి
నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను
అలాగే ఇకపై ఉంటానని ... ఏదో అనేవాన్ని
కానీ అది నిజం కాదు అనేది
ఆ సమయంలోనే కాదు ఇప్పటికీ
తెలుస్తూనే ఉంది ..
మరొకరి జీవితాన్ని స్వర్గమయం చేస్తూ
నువ్వు ఎక్కడో ఉండి ఉంటావు
నిన్నిలా జ్ఞాపకం చేయడం భావ్యం కాదు
కానీ .. సర్వం ఉన్నా ,
ఏ లోటు రానివ్వకుండా చూసుకొనే
జీవిత భాగస్వామి ఉన్నా ..
ఆ ప్రేమలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఆనందం ఉన్నా ...
ఏదో సమయంలో , ఏదో సందర్భంలో
ఎందరో ప్రేమికుల హృదయాలను , ....
అది మోసపోయి ఉండని..మోసగించి ఉండనీ
వినోదాన్ని ఇచ్చిఉండని , విషాదాన్ని ఇచ్చి ఉండనీ
అహంతో వీడిపోనీ ..స్వాభిమానంతో దూరం కానీ
అనుమానంతో అంతమైపోనీ , అపార్థంతో వీగిపోనీ
తొలి ప్రేమ అనేది జ్ఞాపకం రాకుండా ఉండదు కదా ...
ఆ ఆలోచనే నా నైతికతను
సమాధాన పరుస్తూ ఉంటుంది
నేను మానసికంగా వ్యభిచారిస్తున్నానో
ఆత్మవంచన ముసుగు లేకుండా
పారదర్శకంగా ఉంటున్నానో ...చెప్పలేను
నా పరిస్థితిలో నువ్వూ ఉంటావు
అని చెప్పలేను ..ఉంటే మాత్రం
బహుశ నువ్వూ చెప్పలేవేమో ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
1 Comments
Excellent!!!!!
Reply Delete