Followers

Tuesday, September 12, 2017

thumbnail

నిశబ్ధం ..





నిజానికి నిశబ్ధం .. నిశబ్ధంలా ఉండదు
వినగలిగే ఆసక్తి , సహృదయత ఉంటే ..
కొన్నిసార్లు నిశబ్ధం .. నిశబ్ధంగా ఇలా ధ్వనిస్తుందంటే
ఎప్పుడూ దాన్ని వాక్యాల్లో చదివి ఉండమూ ..
అలాంటి నిశబ్ధం ..
నీకూ .. నాకు మధ్య ...
నువ్వెన్నో చెప్పాలనుకుంటావు
మాటలతోనో .. చర్యలతోనో
అవి చిరునవ్వుతో కానీ
చిరాకుతో కానీ .. కానీ
ఏది చెప్పలేకపోతావు
ఎందుకో తెలుసా
మన మధ్య నిశబ్దాన్నే ఇష్టపడుతావు
అనడం కంటే ఆ నిశబ్దాన్ని
నేనర్థం చేసుకుంటాననే
విషయాన్ని ఇష్టపడుతావు .. ..
thumbnail

**** వర్షపు బిందువు ****



ఒక వర్షపు బిందువు నీ శిరస్సు నుండి 
జాలు వారి స్వగతంగా అనుకున్నది 
కురుల్లో నిలిచి పోదామనుకుంటే 
దట్టమైన వనం లా ఉండి 

భయమేసి క్రిందికి జారాను 
నుదురు ఇంత విశాలంగా ఉంది ..
ఎక్కడ ఆగాలో తెలియక క్రిందికి జారాను ..
కన్నుల్లో ఇంత ఆర్ద్రత ఉందంటే ..
అక్కడ నిలవలేకపోయాను
నాసిక సూటిగా ఉండటంతో జారిపోయా
అధరాలు పూరెమ్మల నాజూగ్గా ఉండి
తేనే లోని తీపిలా ఉంటే ఆస్వాదిస్తూ
మై మరిచి క్రిందికి జారాను ..
శంఖం లాంటి మెడ లో నిలవలేక జారీ పోయా ..


( వర్షం మరింత ఎక్కువై .. ఇంకేం ఆలోచించే అవకాశం లేక చుక్క జారీ .. పోయింది ) 😊🤣😁😊.

Thursday, September 7, 2017

thumbnail

!! నీ అందం..... !!



నన్ను చూడకుండానే ఎన్నో కవితల్లో
నా అందాన్ని వర్ణించావు
నీ ఎదురుగా సాక్షాత్కరించాను .. 
ఇప్పుడు ఇంకెలా వర్ణిస్తావు ...తను అంది
సందిగ్దంలో పడి .. వర్ణించలేననుకుంటే
అహం అంగీకరించలేదు ....
సరే అనుకుంటే ... సమర్థత సరిపోలేదు
ఎదురుగా కనిపిస్తున్న
జాబిల్లి జాలిగా చూసింది
నా నేస్తం అందాన్ని
నీ వెన్నెలతో పోల్చి వర్ణించనా ... అడిగాను
వద్దొద్దు ... నా వెన్నెలను
అందరూ ఒకేలా ఇష్టపడరు
విరహం కలిగిస్తానని కొందరు ..
ఆహ్లాదం కలిగిస్తానని కొందరు
వాదులాడుకుంటారు ..
నీ నేస్తం అందంపై వాదనే ఉండదు
నా వెన్నెలతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
భారంగా నిట్టూర్చి మా తోటలోని పూలనడిగాను
మా అందం తాత్కాలికం ..
కొమ్మ నుండి వీడిపోతే వాడిపోతాము
నీ నేస్తం అలా కాదే .. శిశిరంలో సైతం అలాగే ఉంటుంది
మా లాలిత్యంతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
ఏకాంతంలో కూర్చోని ..
ఉప్పొంగే భావాలనడిగాను
అవి నిరాశగా అన్నాయి
భగ్నప్రేమికుడివని ..
విరహం , వేదన తప్పా ఇంకేం రాయలేవని...
నీ భావాలను ఆయిష్టా పడేవారెందరో ఉన్నారు
నీ భావాలేమంత అందంగా ఉంటాయని ..
తనతో పోల్చుతావు
నీ భావాలతో పోల్చి నీ నేస్తం అందాన్ని తగ్గించకూ ......
నిరాశ పడుతుంటే నా మనసు అన్నది
అందరినీ ఎందుకింత ప్రాధేయపడ్తావు
నీ రూపం అందంగా లేకపోవచ్చు ..
నీ మానసిక సౌందర్యం చూసే తను నీ నేస్తం అయింది
నీ నేస్తం సౌందర్యానికి ఏది సాటిరాకపోయిన
తను స్నేహించే నిష్కల్మషమైన , సున్నితమైన
నీ మానసిక సౌందర్యంతో పోల్చి వర్ణించు .... .....

Monday, September 4, 2017

thumbnail

** ఒక అందమైన రాత్రి.. **



ఒక అందమైన రాత్రికి 
నిర్వచనమంటే ఎలా చెప్పనూ 
నీకెలా అనిపిస్తుందో కానీ ... 
నాకనిపించేదే చెబుతా.. 

ఆర్ధరాత్రి దాటాక 
ఆరుబయిట వెన్నెల్లో 
అదృశ్యంగా మంచు కురుస్తునప్పుడు

 దీపాలను ఆర్పీ 
కొవ్వొత్తి వెలుగులో 
అప్పుడప్పుడు కాఫీ సిప్ చేస్తూ

ఒకరిని ఊహల్లో తెచ్చుకొని 
ఆ భావాన్ని అక్షర రూపంలో పెడుతూ 
తను చదివితే ఎలా స్పందిస్తుంది అని 
మందహసిస్తూ గడిపే రాత్రే 
ఒక అందమైన రాత్రి ....

Friday, September 1, 2017

thumbnail

*** ఎలా అనుకుంటేనేం ... **


బహుశ .. స్కోత్కర్ష పదేపదే
రాసుకొనే వాళ్ళే గొప్పోళ్ళు కావచ్చు
నిన్ను నువ్వు పొగుడుకోక 
నిశ్చలనంగా ఉంటే శవం అనుకుంటారిప్పుడు
బహుశ .. ప్రలోభాలతో ప్రబావితం
చేసేవాళ్ళదే మార్కెట్ కావచ్చు
సరుకెంత బాగున్న
సంత మనది కానప్పుడు అమ్ముడుపోదు ఇప్పుడు
బహుశ .. ఆచరించకపోయిన
నీతులు రాస్తేనే హుందాతనం కావచ్చు
నీ చుట్టూ నలుగురు నీవాళ్లు
లేకుంటే శూన్యమైపోతావు ఇప్పుడు...
బహుశ .. మరీ వంగడం
నీ అతి వినయానికి తార్కాణం కావచ్చు
వెన్నుముక కు అలవాటైతే
నిటారుగా నిలబడలేవు ..ఎప్పుడు
thumbnail

*** గ్యాపకం వస్తావే .. ***


సీకటి బడ్తుంటది ..
ఆకాసంలో గూట్లకు ఎల్లే పక్సుల్ని
జూత్తుంటే దిగులవుతది..
పక్సుల్లాగే ..నా గూటికి నేఁ
తిరిగిల్లెదుంటే ఎంత మంచిగుంటుండెనో..
గిట్ల అనుకుంటే శానా ఎడ్పోస్తది... గప్పుడు
అవ్వ.. నువ్వు శానా గ్యాపకం వస్తావే ..
నువ్వేమో ముసలవ్వ కాడ ఊళ్ళో ఉంటవ్
గాడ పన్లేమి లేక నాయన కూలిజేస్కుంటు
దూరంగా గీ పట్నంలో ఉంటడు
నాకాడేందుకే.. పోరన్నీ సదువుకోనీవే
నాయనంటే ఇనవ్
పోరడుంటే కూలి పైసలేక్కువ వస్తాయని
నువ్వంటావ్..
నాయినతో కూలి పన్లో దినమంత
ఎట్టానో గడిసిపోద్ది .. రాతిరే.. పెయ్యంత
నొప్పి పెట్టుద్ది .. గప్పుడు ఏడుస్తుంటే
నాయిన లేచి దగ్గరికి తీసుకుంటాడు
నేను నిద్దరోయిన అనుకోని
దూరంగా ఎల్లి ఏడుస్తుంటడు ..
ఎందుకో నాకైతే తెల్వదుగాని ..
అవ్వ గీడ నువ్వుంటే నాయినను
అడిగేదానివి .. కండ్లు తుడ్సెదానివి ..
నువ్ గీడికి రావు .. మేం గాడికి రాము
నేఁ ఏడిస్తే నాయిన ఏడుస్తాడు
ఇగ ... నేనెప్పుడు ఏడ్వ ..
ఎంత పెయ్ నొప్పిపెట్టిన ..నువ్వెంత యాదికొచ్చిన .. ....

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.