నిజానికి నువ్వేమి కావు
కానీ .. అలా అనుకోడానికి
నా మనసు ఒప్పుకోదు
నిజానికి నువ్వెoతో దూరం
కానీ ... చూడకుండా ఉండటానికి
నా దృష్టి ఒప్పుకోదు …
నిజానికి నువ్వొక అందమైన జ్ఞాపకం
కానీ... గతమనుకోవడానికి
నా వర్తమానం ఒప్పుకోదు
ఇవన్నీ .. నీకు చెప్పలేక
ఒకరితో పంచుకోలేక
మనసుకు ఒప్పించుకోలేక
వాక్యాల్లో రాయలేక ...
హృదయపు అట్టడుగులో
నిక్షిప్తం చేసి
అది కనిపించకుండా ఏవేవో
వ్యాపకాల రాళ్ళెస్తాను
కానీ ... తొలిసంధ్య కిరణాల్లో
అప్పుడు వీచే చిరుగాలుల్లో
మంచుబిందువులతో స్నానించిన పుష్పాల్లో
అర్ధరాత్రి దాటాక కనిపించే వెన్నెల్లో
నిశభ్దపు వేళ వినిపించే శ్రావ్యమైన ధ్వనిలో ....
ఇలా బాహ్యంలో కనిపించే ప్రతి అందంలో
చివరికి విధాతను స్మరించాలని చేసే ఏకాగ్రతలో
నువ్వు కనిపిస్తూ ఉంటావు .. అలా కనిపించినప్పుడల్లా
నిక్షిప్తమై ఉన్నా ఎన్నో భావాల్లో కదలిక ....
వాటిని స్థిమితం చేసే ప్రయత్నంలో
ఎన్నో చర్యలు చేసి ..చేసి చివరకు
బాధగా కళ్ళు మూసుకుంటాను
అప్పటి వరకు కనురెప్పల ముడతల్లో ఉన్న
నీ రూపం ఇంకా స్పష్టంగా ఎదురుగా సాక్షాత్కరిస్తుంది
అలాగే ఉండిపోతాను
నా పరిస్థితికి ఇంకేం చేయలేక ....